సంక్షోభ సృష్టికి వైయస్ జగన్ రెడీ

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రిగా కె.రోశయ్యను కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) ద్వారా ఎంపిక చేయడానికి రంగం సిద్దమైన స్థితిలో రాజకీయ సంక్షోభానికి తెర తీసేందుకు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. కొండా సురేఖ రాజీనామా ద్వారా జగన్ వర్గం పార్టీ అధిష్టానానికి హెచ్చరిక చేసినట్లు భావిస్తున్నారు. అంతా సద్దుమణిగిందనే వాతావరణం ఏర్పడిందని భావించి సిఎల్పీ సమావేశం ఏర్పాటుకు, శాసనసభా సమావేశం ఏర్పాటుకు పార్టీ అధిష్టానం సన్నాహాలు చేసిన సమయంలో జగన్ వర్గం తన ఉద్దేశాన్ని బయటపెట్టిందని భావిస్తున్నారు. జగన్ తోనూ, రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావుతోనూ చర్చించిన తర్వాతనే సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారనే మాట బలంగా వినిపిస్తోంది.

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని గట్టిగా వాదిస్తున్నవారిలో సురేఖ మొదటి నుంచి అగ్రభాగాన ఉన్నారు. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగిస్తారనే అభిప్రాయం బలపడింది. ఈ స్థితిలో రాజీనామా చేయడం ద్వారా పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తేవాలనే ఉద్దేశమే ఆమెను ముందుకు కదిలించినట్లు చెబుతున్నారు. నిజానికి, మంత్రి పదవికి రాజీనామాను ముఖ్యమంత్రికి సమర్పించాల్సి ఉంటుంది. అయితే సురేఖ నేరుగా గవర్నరుకు పంపించారు. ముఖ్యమంత్రి అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే గవర్నర్ మంత్రుల రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ కు సురేఖ సమర్పించిన లేఖ ఎలాగూ ముఖ్యమంత్రి కె.రోశయ్య వద్దకు వస్తుంది. ఆ రకంగా రోశయ్యను, పార్టీ అధిష్టానాన్ని ఇరకాటంలో పెట్టాలనేది జగన్ వర్గం ఉద్దేశంగా చెబుతున్నారు.

సిఎల్పీ సమావేశాన్ని అడ్డుకోవడానికి ఇప్పటి నుంచి జగన్ వర్గం పావులు కదుపుతున్నట్లు సురేఖ రాజీనామా ద్వారా తెలుస్తోందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, వులివెందుల శాసనసభా నియోజకవర్గం ఎన్నిక,వీరప్ప మొయిలీ రాష్ట్ర పర్యటన, సిఎల్పీ సమావేశం ఏర్పాటు వంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వర్గం సంక్షోభ సృష్టికి సిద్ధపడినట్లు భావిస్తున్నారు. జగన్ ను ముఖ్యమంత్రి చేయరనే సంకేతాలు స్పష్టంగా అంది, రోశయ్యను ముఖ్యమంత్రిగా స్థిరపరిచేందుకు పార్టీ అధిష్టానం సిద్ధపడిన సమయంలో సంక్షోభం సృష్టించడం ద్వారా తమ మనోగతాన్ని తెలియజేయడానికి జగన్ వర్గీయులు పూనుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+