కర్నూల్ : పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదావశాత్తు అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో బ్యాంక్‌లోని ఫర్నీచర్, కంప్యూటర్లు, ఏటీఎంలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 25 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిసింది. ఈ రోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో బ్యాంక్ గదుల నుంచి పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.