విజయవాడ: విజయవాడ- మంగళగిరి మధ్య జాతీయ రహదారిపై ప్రాజెక్ట్ మానిట రింగ్ యూనిట్ (పీఎన్‌యూ) ఆధ్వర్యంలో ఫుడ్ కోర్టు నిర్మించేందుకు రంగం సిద్ధమౌతోంది. రాష్ట్రప్రభుత్వ సచివాలయం నుంచి వచ్చిన సూచనలతో కలెక్టర్ రామాంజనేయులు, మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమలతో కలసి మంగళవారం సాయంత్రం కాజ, మంగళగిరి, తాడేపల్లి, ఆత్మకూరు ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల పరిశీలన జరిపారు. ఈ ప్రాజెక్ట్ కింద జాతీయ రహదారిపై ప్రయాణించే ప్రజల సౌకర్యార్థం రెస్టారెంట్, టాయ్‌లెట్స్, చిల్డ్రన్ పార్క్, షాపింగ్ కాంప్లెక్స్, హ్యాండ్‌లూమ్ ప్రదర్శనశాల నిర్మిస్తారని సమాచారం.
ఇందుకోసం ఆరు నుంచి పదెకరాల స్ధలం అవసరమౌతుంది. నెం.5 జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఫుడ్‌కోర్టు ప్రతిపాదన ముందుకు వచ్చింది. ఈ ప్రాంతంలో భూముల విలువ కోట్ల రూపాయలు ఉండడంతో ప్రభుత్వ, దేవాదాయ స్థలాలు ఏమైనా ఉన్నాయా? అనే దిశగా కలెక్టర్ పరిశీలన జరిపారు.
కొలనుకొండలోని 50/1ఎ లో ఉన్న విశ్వేశ్వరస్వామి దేవస్థాన భూములు మూడెకరాలతో పాటు, భోగేశ్వరస్వామి దేవాలయ భూములను కూడా కలెక్టర్ పరిశీలించారు. రెవెన్యూ అధికారుల నుంచి రికార్డులు తెప్పించి చూశారు. అంతకు ముందు కాజ గ్రామంవద్ద ఉన్న చెరువు పోరంబోకును కలెక్టర్ పరిశీలించారు.