హైదరాబాద్: ప్రజలు తమ సమస్యలపై ఫోన్లు చేయడానికి వీలుగా గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ కార్పొరేటర్లకు టోల్ ఫ్రీ ఫోన్ నెంబర్లు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు యోచిస్తున్నారు. ఈ సలహాను కొత్తపేట డివిజన్ నుంచి గెలిచిన ప్రకాశ్‌గౌడ్ అనే కార్పొరేటర్ చంద్రబాబుకు ఇచ్చారు. టోల్ ఫ్రీ నెంబర్ ఉంటే ఎక్కువమంది ప్రజలు తమ సమస్యలు చెప్పడానికి ఉత్సాహం చూపిస్తారని, దీనివల్ల కార్పొరేటర్లకు ప్రజా సంబంధాలు పెరుగుతాయని ఆయన వివరించారు.
ఈ సలహా చంద్రబాబుకు బాగా నచ్చింది. దీనిపై అధ్యయనం చేసి తప్పక అమలు చేయడానికి ప్రయత్నిస్తానని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ కార్యాలయంలో తనను కలవడానికి వచ్చిన కార్యకర్తలతో మంగళవారం ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.