న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి అండగా తాము కూడా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక ఉద్యమంలో పాల్గొంటామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) నేత మందకృష్ణ మాదిగ చెప్పారు. తాము కేవలం మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటామని ఆయన చెప్పారు. తాను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కె. రోశయ్యతో మాట్లాడడానికి వచ్చానని, తాను రోశయ్యను కలిశానని, వర్గీకరణతో పాటు తెలంగాణ సమస్యను పరిష్కరించాలని తాను రోశయ్యను కోరారని, తాను నెరవేరుస్తానని చెప్పారని ఆయన గురువారం అన్నారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించనప్పుడు అది ఆగ్రహ రూపం తీసుకుంటుందని, తెలంగాణ విషయంలో అదే జరుగుతోందని ఆయన అన్నారు. ఇప్పటి ప్రకంపనలు 5, 10 శాతమే ఉన్నాయని, అది వంద శాతం చేరుకుంటుందని, అప్పుడు రాష్ట్రంలో అగ్ని రాజుకుంటుందని ఆయన చెప్పారు.
తాము డిసెంబర్ లో వర్గీకరణపై ఉద్యమం ప్రారంభించబోతున్నామని, ఇటు తెలంగాణ అటు వర్గీకరణ ఉద్యమంతో రాష్ట్రం అల్లకల్లోలమవుతుందని ఆయన అన్నారు. రాజకీయ ప్రక్రియ ద్వారా తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ సాధనకు ఇంత కాలం పని చేశారని, ఇప్పుడు ఉద్యమ రూపం తీసుకున్నారని, ఉద్యమ రూపం తీసుకోవడంతో తాము ముందుకు వచ్చామని చెప్పారు. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణవాదాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా తీసికెళ్లారని, అయితే ఉద్యమ రూపం లేకుండా డిమాండ్ల సాధన సాధ్యం కాదని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో గానీ వర్గీకరణ విషయంలో గానీ వివిధ రాజకీయ పార్టీలు నామమాత్రంగా మద్దతు తెలుపుతున్నాయని గాని ఉద్యమాల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధపడడం లేదని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవహారం అందుకు ఉదాహరణ అని ఆయన అన్నారు.