తెలంగాణపై డిఎస్ పై పాల్వాయి గుర్రు

కాగా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు దీక్ష విరమించాలని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులతో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశమైన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దీక్ష విరమించి కెసిఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియాతో మాట్లాడాలని ఆయన సూచించారు. తాము అవసరమైనప్పుడు ఢిల్లీ వెళ్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ఉద్యమం రాజుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు 15 రోజుల పాటు సెలవులు ప్రకటించింది.
ఇదిలా ఉంటే, తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి. పలు జిల్లాల్లో రాస్తారోకోలు, ధర్నాలు సాగాయి. నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు జరిగాయి. నార్కెట్ పల్లి వద్ద ఆందోళనకారులు బస్సులు అద్దాలు పగులగొట్టారు. రాస్తారోకోతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. కోదాడలో ర్యాలీ నిర్వహించారు. హైదరాబాదులోని ఉప్పల్ లో శాసనసభ్యుడు రాజిరెడ్డి ఇంటి ముందు విద్యార్థులు ధర్నా చేశారు. రాజిరెడ్డి తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యకు ఆగ్రహం చెందిన వారు ఘెరావ్ చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో పోలీసులు ముగ్గురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. విద్యార్థులు గురువారం హైదరాబాదులో పలు చోట్ల ప్రదర్శనలు నిర్వహించారు. శాసనసభ వద్ద ర్యాలీ చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రిలే నిరాహార దీక్షలు సాగిస్తున్నారు. న్యాయవాదులు, వైద్యులు ఆందోళనలకు దిగారు.
తన తండ్రి ఆరోగ్యం పట్ల కెసిఆర్ తనయుడు, శానససభ్యుడు కెటి రామారావు ఆందోళన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారని, నిలకడకు అర్థమేమిటో చెప్పాలని ఆయన అన్నారు. కెసిఆర్ ఆరోగ్యంపై వైద్యులు తమకో మాట, మీడియాకు మరో మాట చెబుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ కు ఏమైనా జరిగితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని ఆయన అన్నారు. కెసిఆర్ నీరసంగా ఉన్నారని, తనను కలవడానికి వచ్చిన వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.