హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు అనర్హుడని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్ర విభజనపై స్పష్టమైన ప్రకటనకు తెలంగాణ తెలుగుదేశం నాయకులు చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటనపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన కోస్తాంధ్ర, రాయలసీమ కాంగ్రెసు నేతలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు తమ రాజీనామాలను ఉపసంహరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉందామని ఆయన పార్టీ కోస్తాంధ్ర, రాయలసీమ పార్టీ సహచరులకు ఆయన సూచించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
స్నేహపూర్వకర వాతావరణంలో పార్టీ నిర్ణయానికి కాంగ్రెసు నాయకులు కట్టుబడి ఉండడం మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ తీర్మానం అవసరమా, లేదా అనేది తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని, ఆ విషయాన్ని పార్టీ అధిష్టానానికి వదిలేయడం మంచిదని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన కోస్తాంధ్ర, రాయలసీమ నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారని, ఆ స్వేచ్ఛ వారికి ఉందని ఆయన అన్నారు. పార్టీలో సమన్వయానికి పార్టీ అధిష్టానం ప్రయత్నిస్తోందని ఆయన చెప్పారు. కాంగ్రెసు ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి