అక్కడ 'నో పెట్రోల్.. నో డీజిల్'.. "బ్లాక్ అవుట్" ప్రకటించిన ప్రభుత్వం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. ఇక ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. దాంతో అటు పేద, మధ్య తరగతి దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు కూడా సంక్షోభంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి నుంచి బయట పడేందుకు పలు దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాల్లో లాక్ డౌన్ తరహా ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఇంధన కోటాను విధిస్తున్నాయి. శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాల్లో వారానికి ఒక వాహనానికి కేవలం 5 లీటర్ల పెట్రోల్ మాత్రమే ఇచ్చేలా నిబంధనలు అమల్లోకి వచ్చాయి.
అయితే తాజాగా ఇంధన సంక్షోభం కారణంగా క్యూబా అట్టుడుకుతోంది. ఈ మేరకు క్యూబా ప్రభుత్వం అక్కడ బ్లాక్ అవుట్ విధించింది. పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి. దీనివల్ల దేశంమొత్తం అంధకారంలోకి మునిగిపోయింది. దాంతో ప్రభుత్వం అధికారికంగా బ్లాక్ అవుట్ ప్రకటించింది. క్యూబా రాజధాని హవానాలో రోజుకు 20 నుంచి 22 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. దీనివల్ల ఆస్పత్రులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. పర్యాటక రంగం తీవ్రంగా దెబ్బతింది.
అమెరికా విధించిన ఆర్థిక దిగ్బంధనం కారణంగా ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఇక క్యూబాకు చమురు సరఫరా చేసే వెనిజులా, మెక్సికో దేశాల సరఫరాను నిలిపివేశాయి. క్యూబాకు ఇంధనం పంపే దేశాలపై భారీ సుంకాలను విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. మరోవైపు ఇదే విషయంపై క్యూబా ఇంధన మంత్రి విసింటే డి లా ఓ లెవీ మాట్లాడుతూ.. దేశంలో గ్యాస్ నిల్వలు చాలా పరిమితంగా ఉన్నాయని, పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఏ దేశం ఇంధనం అమ్మేందుకు ముందుకు వచ్చినా కొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు.

మరోవైపు అమెరికా 100 మిలియన్ డాలర్ల విలువైన మానవతా సాయాన్ని ఆఫర్ చేసినట్లు సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో పేర్కొన్నారు. అయితే క్యూబా ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చింది. ఇక అంతర్జాతీయ రాజకీయ ఒత్తిళ్లు, అమెరికా ఆంక్షల కారణంగా క్యూబాలో చమురు నిల్వలు నిండుకున్నాయి. క్యూబాలో ప్రస్తుతం భారీ విద్యుత్ సంక్షోభం నెలకొంది.












Click it and Unblock the Notifications