హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా ప్రదర్శనను తెలంగాణలో అడ్డుకోవడం సరి కాదని మాజీ మంత్రి, ప్రముఖ సినీ నటుడు బాబూ మోహన్ అన్నారు. అదుర్స్ సినిమాను అడ్డుకుంటామనే తెలంగాణ ఆందోళనకారులకు కొంత వ్యతిరేకత ఎదురవుతోంది. తెలంగాణలో అదుర్స్ చిత్రం విడుదలను అడ్డుకుంటామని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రకటించడం సమంజసం కాదని బిజెపి జాతీయ కార్యదర్సి ఇంద్రసేనారెడ్డి అన్నారు. ఇటువంటి చర్యల వల్ల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ వెనక్కి పోతుందని తెలంగాణకు చెందిన ఆ నాయకుడు మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
అదుర్స్ సినిమాను అడ్డుకుంటామనే తెలంగాణ జన జాగృతి కన్వీనర్ కల్వకుంట నిర్ణయాన్ని తెలంగాణ తెలుగు యువత తీవ్రంగా వ్యతిరేకించింది. సినిమా ప్రదర్శనను అడ్డుకుంటే దాన్ని ఎలా ఎదుర్కోవాలో తమకు తెలుసునని యువత అధ్యక్షుడు దీపక్ రెడ్డి అన్నారు. బతుకమ్మ పండుగను ఢిల్లీ దాకా తీసుకుపోయిన కవిత అదుర్స్ సినిమాను అడ్డుకోవాలనుకోవడం సరైంది కాదని ఆయన అన్నారు. కాగా, సినిమాను ప్రదర్శించబోమని వరంగల్ కు చెందిన రిలయన్స్ యాడ్ ల్యాబ్ ప్రకటించింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి