హైదరాబాద్: కరువు పీడిత ప్రాంతాల్లో మేఘమథనం కొనసాగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి స్పష్టం చేశారు. పంటల బీమా పథకం కింది సొమ్మును ఆన్ లైన్ ఖాతాలో జమ చేసే పథకాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్య గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘువీరా రెడ్డి మాట్లాడారు. మేఘ మథనంపై విమర్శలు చేయడం అర్థరహితమని ఆయన అన్నారు. రైతులకు మేలు జరిగే అన్ని పథకాలూ కొనసాగుతాయని ఆయన చెప్పారు. కరువు ప్రాంతాల రైతులను ఆదుకుంటామని ఆయన చెప్పారు.
కరువు బీమా పథకం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 801 కోట్ల రూపాయలను ఆయన రైతుల ఖాతాల్లో జమ చేశారు. తాము అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.