హైదరాబాద్: ఫిట్మ్ మెంట్ బెనిఫిట్ పై ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య బుధవారం ఒప్పందం కుదిరింది. గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలకు మధ్య ఫిట్మెంట్ బెనిఫిట్ పై చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది. బుధవారం ముఖ్యమంత్రి కె. రోశయ్య ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపారు. ఉద్యోగులకు 39 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే ఉద్యోగ సంఘాల నేతలు 40 శాతం డిమాండ్ చేస్తున్నారు. అయితే చివరకు ఉద్యోగ సంఘాల నేతలు 39 శాతం వద్ద అంగీకరించారు. దీంతో ఉద్యోగుల్లో ఒప్పందంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ఒప్పందంపై ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు.
39 శాతం మానిటరీ బెనిఫిట్ ను కూడా 2010 నుంచి ఇస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే వారు 2009 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఏ మాత్రం దిగి రాలేదు. దీంతో ప్రభుత్వ నిర్ణయానికే ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. ఉద్యోగుల మరిన్ని ప్రయోజనాలు శాసనసభ సమావేశాల తర్వాత పరిశీలిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఖాజానా ఖాళీగా ఉండడంతో ప్రభుత్వోద్యోగుల పూర్తి డిమాండ్లను నెరవేర్చలేకపోతున్నామని, దీన్ని అర్థం చేసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు తాము వెనక్కి తగ్గామని ఉద్యోగ సంఘాల జెఎసి నాయకులు చెప్పారు. పెరిగిన ఫిట్మెంటులో సీనియర్ ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరిగిందని మోహన్ రెడ్డి అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి