హైదరాబాద్: తెలంగాణపై రాజీనామాలకు, డెడ్ లైన్లకు కాంగ్రెసు తెలంగాణ నాయకులు క్రమంగా వెనక్కి తగ్గుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణపై కమిటీ వేస్తామని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం చేసిన ప్రకటన స్పష్టంగా ఉన్నందున ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదని, ఇంకా డెడ్ లైన్లు పెట్టాల్సిన అవసరం లేదని చాలా మంది కాంగ్రెసు తెలంగాణ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెసు జెఎసిలో ఉండాల్సిన అవసరం లేదని కూడా కొంత మంది అభిప్రాయపడుతున్నారు. డెడ్ లైన్లు, రాజీనామాలు వంటి వ్యవహారాల ద్వారా పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పించవద్దని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ అన్నారు. జెఎసిలోని కాంగ్రెసు నాయకులు కె. జానా రెడ్డి, బస్వరాజు సారయ్య శుక్రవారం ఆయనను కలిశారు. ఈ సమయంలో డిఎస్ ఆ విధంగా వ్యాఖ్యానించారు.
రాజీనామాలు, డెడ్ లైన్లు అవసరం లేదని కాంగ్రెసు సీనియర్ నేత వి. హనుమంతరావు కూడా అన్నారు. డెడ్ లైన్ల విషయంలో ఆయన పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై విమర్శలు కూడా చేశారు. కెసిఆర్ డెడ్ లైన్లు పెట్టడం అలవాటని ఆయన అన్నారు. డెడ్ లైన్లు, రాజీనామాలు అవసరం లేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని మరో కాంగ్రెసు సీనియర్ నేత అమోస్ ఢిల్లీలో అన్నారు. తెలంగాణ తెచ్చేది, ఇచ్చేది కాంగ్రెసు పార్టీయేనని, అందువల్ల కాంగ్రెసు తెలంగాణ జెఎసిలో కాంగ్రెసు ఉండాల్సిన పని లేదని ఆ పార్టీ సీనియర్ శాసనసభ్యుడు పి. శంకరరావు హైదరాబాదులో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి రోశయ్యనే అని, ఈ ఏడాదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ అన్నారు. రాజీనామాల విషయంలో జెఎసి ముఖ్య భూమిక పోషిస్తున్న దామోదర్ రెడ్డి, జానా రెడ్డి కూడా సానుకూలంగా లేరు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి