128 బిలియన్ డాలర్ల కథ.. బ్యాంకుల వద్ద కొండలా పేరుకుపోయిన డబ్బు
భారత ఆర్థిక రంగాన్ని విదేశీ పెట్టుబడులు, విదేశీ కరెన్సీ డిపాజిట్లు ముంచెత్తడం సాధారణంగా శుభసూచకంగా భావిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లలో హెచ్చుతగ్గులు ఎదురైనప్పుడు రూపాయి విలువ పడిపోకుండా కాపాడుకోవడానికి, ఫారెక్స్ రిజర్వులు భారీగా పెంచుకోవడానికి ఆర్బీఐ అనుసరించిన వ్యూహం అద్భుతంగా పారేసింది.
ఎన్నారై డిపాజిట్ల ద్వారా భారత బ్యాంకులు ఊహించిన దానికంటే ఎక్కువగా దాదాపు 128 బిలియన్ డాలర్లను సేకరించాయి. ఈ విదేశీ కరెన్సీని బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ వద్ద మార్పిడి చేసుకుని రూపాయిలను పొందాయి. దీనివల్ల దేశ ఫారెక్స్ నిల్వలు చారిత్రాత్మక గరిష్టానికి చేరి ఆర్థిక వ్యవస్థకు కొండంత అండగా నిలిచాయి. అయితే, ఈ నాణేనికి మరో అత్యంత క్లిష్టమైన రెండో వైపు కూడా ఉంది.

దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో రూ. 15 లక్షల కోట్లు
అటు డాలర్లు సురక్షితంగా విదేశీ మారక నిల్వల్లో చేరినప్పటికీ, దానికి ప్రతిగా రిజర్వ్ బ్యాంక్ మార్కెట్‌లోకి విడుదల చేసిన రూపాయలు ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో భారీగా పేరుకుపోయాయి. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థలో దాదాపు 14 నుంచి 15 లక్షల కోట్ల రూపాయల అదనపు నగదు మిగిలిపోయింది. ఇది సాధారణంగా జరిగే మార్పు చేర్పుల కంటే చాలా పెద్దది. ఇంత భారీ ఎత్తున నగదు చెలామణిలో ఉండటం వల్ల ద్రవ్య మార్కెట్లు, వడ్డీ రేట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఏర్పడింది. విజయం అనుకున్న డాలర్ల సేకరణ, ఇప్పుడు ఆర్బీఐ ముందు రూ.15 లక్షల కోట్ల పెద్ద సమస్యగా వచ్చి పడింది.
డబ్బులు తీసుకోవడానికి ముందుకు రాని బ్యాంకులు.. ఎందుకలా?
వ్యవస్థలోని అదనపు నగదును వెనక్కి లాక్కోవడానికి ఆర్బీఐ ఇటీవల 30 రోజుల వ్యవధితో కూడిన 'వేరియబుల్ రేట్ రివర్స్ రెపో' (VRRR) విధానం ద్వారా రూ. 7 లక్షల కోట్లను స్వీకరించేందుకు వేలం నిర్వహించింది. బ్యాంకింగ్ రంగంలో డబ్బులు కుప్పలుతెప్పలుగా ఉన్నప్పటికీ, బ్యాంకుల నుంచి కేవలం రూ. 2.59 లక్షల కోట్లకు మాత్రమే బిడ్లు వచ్చాయి.
ముందస్తు ఉపసంహరణ వెసులుబాటు కల్పించినప్పటికీ బ్యాంకులు తమ వద్ద ఉన్న నగదును ఆర్బీఐ వద్ద లాక్ చేయడానికి ఆసక్తి చూపలేదు. 24 గంటల డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ, పన్నుల చెల్లింపులు, భవిష్యత్ నగదు అవసరాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు కారణం. మున్ముందు వడ్డీ రేట్లలో వచ్చే మార్పులను తట్టుకోవడానికి బ్యాంకులు నగదును తమ వద్దే ఉంచుకోవడానికి మొగ్గు చూపుతున్నాయి.
రంగంలోకి 'డాలర్-రూపాయి' స్వ్యాప్ వ్యూహం!
ఈ పరిస్థితిని అదుపు చేయడానికి ఆర్బీఐ 'డాలర్-రూపాయి సెల్-బై స్వ్యాప్' (Sell-Buy Swaps) అనే మార్గాన్ని ఎంచుకుంది. ఈ విధానంలో ఆర్బీఐ తన వద్ద ఉన్న డాలర్లను స్పాట్ మార్కెట్లో విక్రయించి, దానికి ప్రతిగా మార్కెట్లోని రూపాయలను వెనక్కి తీసుకుంటుంది. ఒప్పందం ముగిసే సమయానికి మళ్లీ ఆ డాలర్లను వెనక్కి తీసుకుని రూపాయిలను తిరిగి ఇస్తుంది. దీనివల్ల బాండ్ మార్కెట్‌పై ఎలాంటి ఒత్తిడి పడకుండా తాత్కాలికంగా రూపాయి ప్రావాహాన్ని తగ్గించవచ్చు. అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమే. సుదీర్ఘ కాల పరిమితి కలిగిన డిపాజిట్ల వల్ల వచ్చిన నగదును, ఇలాంటి స్వల్పకాలిక స్వ్యాప్‌ల ద్వారా పదే పదే సర్దుబాటు చేయడం ఆర్బీఐకి పెద్ద కసరత్తుగా మారింది.
ఆర్బీఐ ముందున్న కఠినమైన ప్రత్యామ్నాయాలు!
ఈ రూ.15 లక్షల కోట్ల అదనపు నగదును పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఆర్బీఐకి కొన్ని మార్గాలు ఉన్నప్పటికీ, ప్రతీ దానితోనూ ఒక ఆర్థిక భారం ముడిపడి ఉంది:
- సీఆర్‌ఆర్ (CRR) పెంపు: క్యాష్ రిజర్వ్ నిష్పత్తిని పెంచితే డబ్బు లాక్ అవుతుంది కానీ, బ్యాంకుల లాభదాయకతపై దెబ్బపడుతుంది.
- ఓపెన్ మార్కెట్ సేల్స్ (OMO): ప్రభుత్వ సెక్యూరిటీలను శాశ్వతంగా విక్రయించి నగదును లాక్కోవచ్చు. కానీ దీనివల్ల బాండ్ ఈల్డ్స్ పెరిగి, ప్రభుత్వం చేసే రుణ సేకరణ ఖరీదైనదిగా మారుతుంది.
- మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్ (MSS): దీనిద్వారా ప్రత్యేక బాండ్లు జారీ చేసి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చు, కానీ ఈ వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
- రివర్స్ రెపో (VRRR): బ్యాంకులు ఇచ్చే డిపాజిట్లపై ఆర్బీఐ సొంతంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది.
అదనపు నగదుతో ముంచుకొచ్చే ద్రవ్యోల్బణ ముప్పు!
వ్యవస్థలో ఇంత భారీగా నగదు నిల్వలు ఎక్కువ కాలం పాటు ఉండిపోతే, అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది వడ్డీ రేట్లను తగ్గించేలా ఒత్తిడి తెచ్చి, రియల్ ఎస్టేట్, షేర్ మార్కెట్లు, ఇతర నాన్-బ్యాంకింగ్ రంగాల్లోకి అనాలోచిత రుణాల ప్రవాహానికి దారితీస్తుంది. ఇది చివరికి నిత్యావసరాల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఉగ్రరూపం దాల్చడానికి కారణమవుతుంది. డాలర్ల వరదతో దేశం సురక్షితంగా మారినప్పటికీ, దానివల్ల వచ్చిన రూపాయిల ప్రవాహాన్ని సమర్థవంతంగా అదుపు చేయడానికి ఆర్బీఐ ఏ రకమైన కఠిన నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.














Click it and Unblock the Notifications
