సోనియాకు కెవిపిపై తెలంగాణ ఫిర్యాదు

రెండు ప్రాంతాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామని, తమకు రెండు ప్రాంతాలు కూడా ముఖ్యమేనని సోనియా దామోదర్ రెడ్డి, జానా రెడ్డిలతో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, సీమాంధ్ర సమైక్యవాదం వెనక కెవిపి పాత్ర ఎలా ఉందో వారు వివరించిన తర్వాత ఆమె మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు. కేశవ రావుతో కలిసి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ కు తెలంగాణలోని పరిస్థితిని, సీమాంధ్ర ఉద్యమ తీరుతెన్నులను వారిద్దరు వివరించినట్లు తెలుస్తోంది. సీమాంధ్ర శాసనసభ్యుల రాజీనామాల వెనక కెవిపి రామచంద్రరావు ఉన్నారని వారు అహ్మద్ పటేల్ కు చెప్పారు. అలాగే, తెలంగాణ ఉద్యమం వెనక నక్సలైట్లు ఉన్నారనే ప్రచారంలో కూడా నిజం లేదని వారు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. తెలంగాణ ప్రజా ప్రతినిధుల రాజీనామాల విషయాన్ని రాయలసీమకు చెందినవాడు కాబట్టి స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానానికి చెప్పలేదని వారు ఫిర్యాదు చేశారు. వాస్తవాలు అధిష్టానానికి తెలియకుండా సీమాంధ్ర నాయకులు పథకం ప్రకారం పని చేస్తున్నారని వారు వివరించినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్రం ఇస్తే మిమ్మల్ని ఆ ప్రాంత ప్రజలు పూజిస్తారని వారు సోనియాకు చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు నాయకులు ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి కూడా ఉండదని చెబుతూ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను వారు ఉదహరించినట్లు తెలుస్తోంది. ఇదంతా విన్న సోనియా చిదంబరంతో ప్రకటన చేయించినట్లు తెలుస్తోంది.