తెలంగాణ జెఎసిపై కాంగ్రెసు పైచేయి

శాంతియుత ఉద్యమాలు కొనసాగించాలని జెఎసి నిర్ణయం తీసుకుంది. కేంద్ర కమిటీ వేసే కమిటీ తెలంగాణ ఏర్పాటుకు అనుగుణంగా లేకపోతే రాజీనామాలను ఆమోదింపజేసుకుందామని, కమిటీ వేసేంత వరకు ఆగుదామని జెఎసిలోని కాంగ్రెసు నాయకులు వాదించారు. ఉద్యమాలను కొనసాగించాలని జెఎసి నిర్ణయం తీసుకుంది. ఉద్యమ స్వరూప స్వభావాలను శుక్రవారం ఖరారు చేస్తారు. రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెసేతర పార్టీల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పట్టుబట్టారు. అయితే కాంగ్రెసు నేత ఆర్ దామోదర్ రెడ్డి వారి వాదనను తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం.
తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో, ఇతర నేతలతో జరిపిన చర్చల వివరాలను, వారు ఇచ్చిన హామీలను దామోదర్ రెడ్డి సమావేశంలో వివరించారు. ఇక్కడి దాకా వచ్చినాళ్లం, తెలంగాణ సాధించే విషయంలో మేం వెనక్కి తగ్గుతామా అని ఆయన ప్రశ్నించారు. తాము తెలంగాణ కోసం నిలబడుతున్నాం కాబట్టే తాము ఆచితూచి అడుగువేయాలని అంటున్నామని, తొందర పడితే ఇబ్బంది ఎదురవుతుందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.