హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి పి.చిదంబరంపై సీమాంధ్ర నాయకులు విమర్శలు చేయడాన్ని తెలంగాణ రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ తప్పు పట్టారు. చిదంబరం రాసిన పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించారని, అందుకే ఆంధ్రప్రదేశ్ విభజనకు చిదంబరం పూనుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు కె. ఎర్రంనాయుడు, మైసురా రెడ్డి విమర్శించారు. ఆ విమర్సను కోదండరామ్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. కేంద్ర హోం మంత్రి స్థాయి వ్యక్తి వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటారని భావించడం సరి కాదని ఆయన అన్నారు. చిన్న రాష్ట్రాల్లో అభివృద్ధి జరుగుతుందనేది ఒక దృక్పథమని, ఆ దృక్పథానికి అనుగుణంగానే చిదంబరం రాసి ఉంటారని, హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం రాజనీతి శాస్త్ర ఆచార్యుడొకాయన కూడా అటువంటి అభిప్రాయమే వ్యక్తం చేశారని ఆయన అన్నారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అభివృద్ధి చూసిన తర్వాత అటువంటి అభిప్రాయం బలపడుతూ ఉందని ఆయన అన్నారు. భారత్ ను ఫెడరల్ వ్యవస్థగా రూపుదిద్దాలనే అభిప్రాయం కూడా ఉందని ఆయన అన్నారు.
సీమాంధ్ర నేతలు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాదులోని సమైక్య సదస్సు నిర్వహిస్తామని సీమాంధ్ర నాయకులు చెప్పడం సరి కాదని ఆయన అన్నారు. 7వ తేదీన నిజాం కళాశాల మైదానంలో తెలంగాణ ముస్లింల సభ ఉందని, వరంగల్ లో విద్యార్థుల పొలికేక సభ ఉందని, ఇటువంటి సభలు జరుగుతున్న పరిస్థితిలో సమైక్యాంధ్ర సదస్సు నిర్వహించడం రెచ్చగొట్టడమే అవుతుందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి ఆధ్వర్వంలో రేపు బుధవారం శాంతియుత మానవ హారం నిర్వహించునున్నట్లు ఆయన తెలిపారు. ఆదిలాబాదు నుంచి ఆలంపూర్ వరకు ఈ మానవ హారం ఉంటుందని ఆయన చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు మానవ హారం ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణ ఆకాంక్షను సంఘటితంగా వ్యక్తం చేయడానికే ఈ మానవ హారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ధర్నాలు, రాస్తారోకోలు ఉండవని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి