హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తెలంగాణలో ఓదార్పు పర్యటనను మానుకోవాలని తెలంగాణ విద్యార్థుల ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) డిమాండ్ చేసింది. జగన్ ఈ నెల 12వ తేదీ నుంచి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాలు, పీయు, ఎంయూ, ఉర్దూ, వ్యవసాయ తదితర విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆదివారం ఓయులో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు.
వైయస్ జగన్ తెలంగాణలో తన పర్యటనను రద్దు చేసుకోకపోతే సంభవించే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జెఎసి నాయకులన్నారు. ఈ నెల మూడో వారంలో చేపట్టే బస్సుయాత్రపై వారు చర్చించారు.