వైయస్ జగన్ ఓదార్పు యాత్రపై నేడో రేపో హై కమాండ్ ప్రకటన?

జగన్ వైఖరిని ప్రకాశం జిల్లా శాసనసభ్యులు సాయంత్రం అహ్మద్ పటేల్‌కు వివరించినట్లు తెలిసింది. ఓదార్పు యాత్రకు వెళ్లాలన్న ఉత్సాహం తమకేమీ లేదని, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండటానికి తామంతా సిద్ధంగా ఉన్నామని చెప్పినట్లు సమాచారం. స్థానికంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, స్థానిక నాయకుల నుంచి అదే పనిగా ఒత్తిళ్లు చేయిస్తుండటంతో ఇబ్బందికర పరిస్థితి ఉందని వాపోయినట్లు తెలిసింది. తాము వెళ్లక పోతే నియోజక వర్గాల్లోని ద్వితీయశ్రేణి నాయకులకు అర్థబలం సమకూర్చి తమపైకి రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో వెళ్లకపోతే తామే నష్టపోవాల్సి వస్తోందని చెప్పినట్లు తెలిసింది. అధిష్ఠానమే ఏదోఒకటి మధ్యేమార్గం చూపాలని కోరినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో జగన్‌వర్గం ప్రదర్శిస్తున్న దూకుడు, యాత్రను విజయవంతం చేయడానికి చేస్తున్న ఖర్చు, ఇందులో పాల్గొనాలంటూ అనుచరవర్గంతో స్థానిక ప్రజా ప్రతినిధులపై చేస్తున్న ఒత్తిళ్ల గురించి వివరించినట్లు వినికిడి. వారు చెప్పిన విషయాలను శ్రద్ధగా విన్న అహ్మద్ పటేల్ సోనియాను కలిసిన తర్వాత తదనంతర కార్యాచరణ గురించి చెబుతానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పనబాక, మాగుంట నాయకత్వం కేంద్రమంత్రి పనబాక లక్ష్మి, ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి నివాసాలే కేంద్రంగా ఢిల్లీలో ఓదార్పు రాజకీయాలు నడిచాయి. బుధవారం ఉదయమే ఎనిమిది ఎమ్మెల్యేలు పనబాక లక్ష్మి నివాసంలో కూర్చొని అహ్మద్ పటేల్ ముందు వినిపించాల్సిన వాదనలపై కసరత్తు చేశారు. మధ్యాహ్న భోజన సమయంలో కేంద్ర మంత్రి పురందేశ్వరి సమావేశంలో కలిశారు. దీని తర్వాత ఎమ్మెల్యేలు మహీధర్‌రెడ్డి, ఉగ్రనరసింహారెడ్డి, గొట్టిపాటి రవికుమార్, జి.వి.శేషులు నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి నివాసానికి వెళ్లి సుమారు అరగంటపాటు ఆయనతో భేటీ అయ్యారు. ఇందులో మహీధర్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్‌లు అహ్మద్ పటేల్ ను కలవకుండానే హైదరాబాద్ తిరిగి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేలు విజయ కుమార్, సురేష్‌లు కూడా వీరితో పాటే తిరుగు పయనమయ్యారు. కలిసికట్టుగా వచ్చిన ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో అహ్మద్ పటేల్‌ను కలిసే సమయానికి నలుగురే మిగలడం పట్ల కొంత గందరగోళం నెలకొంది. ఈ నలుగురూ అధిష్ఠానం వైఖరి నచ్చక వెళ్లారా? ఇతరత్రా కారణాలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాయంత్రం అహ్మద్ పటేల్‌తో భేటీ ముగిసిన అనంతరం అందులో పాల్గొన్న వారంతా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇంటికి వెళ్లి మరోసారి సమావేశయ్యారు. మాగుంట గురువారం మరోసారి సోనియాను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరారు. ఈ నేపథ్యంలోనే వారంతా కలిసి కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. గురువారం అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నారు.












Click it and Unblock the Notifications