మిడిల్ క్లాస్ కిచెన్‌లో మంట! బియ్యం ధరలకు రెక్కలు
పొద్దున్నే లేచి పొయ్యి వెలిగిద్దామంటే లెక్కలేసుకోవాల్సి వస్తుంది. బజారుకు వెళ్లి బియ్యం తెచ్చుకుందామంటే భయం! పొయ్యి మీద పప్పు వండే పరిస్థితి లేదు, పచ్చడితో తిందామంటే పచ్చిమిర్చి సెగ తట్టుకోలేకపోతున్నారు. ఇది ఏ ఒక్కరి ఇంట్లోని తిప్పలో కాదు.. ప్రతి మధ్యతరగతి, పేద కుటుంబం నిత్యం అనుభవిస్తున్న నరకం. దేశంలోనే అత్యధికంగా వరి పండించే రాష్ట్రంగా పేరున్నా.. సామాన్యుడి పళ్లెంలో సన్న బియ్యం అన్నం మాయమైపోతోంది.
కొద్దిరోజులుగా బియ్యం, కోడిగుడ్డు, చికెన్, చివరికి ఆకుకూరలు, కూరగాయల ధరలకు కూడా రెక్కలొచ్చి ఆకాశంలో విహరిస్తున్నాయి. ప్రతినెల వచ్చే నామమాత్రపు జీతంతో పెరుగుతున్న ఈ ధరల మంటను తట్టుకోలేక, నెల మధ్యలోనే బడ్జెట్ బొక్కబోర్లా పడి సగటు మిడిల్ క్లాస్ మనిషి కన్నీరు పెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది.

భగ్గుమన్న బియ్యం ధరలు..
దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యం పండిస్తూ తెలంగాణ రాష్ట్రం సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో సామాన్యుడి పళ్లెంలో మాత్రం అన్నం ప్రియమైపోతోంది. పంట ఉత్పత్తి దండిగా ఉన్నా మార్కెట్‌లో బియ్యం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకడం గమనార్హం. గత రెండున్నర నెలల వ్యవధిలోనే కేజీ సన్న బియ్యం ధర పైకి లేచి, రూ.10 నుంచి రూ.12 వరకు అదనపు భారం మోపింది.
సోనా మసూరీ, బిపిటి, ఐఆర్-64 వంటి నిత్యం వాడే రకాల క్వింటాల్ ధర మార్కెట్‌లో రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనంగా పెరగడంతో సగటు మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్ తలకిందులవుతోంది. రాబోయే రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో సాగు విస్తీర్ణం తగ్గుతుందన్న ప్రచారాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తూ సరుకును అక్రమంగా నిల్వ చేయడం వల్లే ఈ ధరల మంట రగులుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
చికెన్ ఊసెత్తితేనే భయం.. సెంచరీ దాటేసిన గుడ్డు!
అటు బియ్యం షాక్ నుంచి కోలుకోకముందే, ప్రొటీన్ ఆహారం పేరిట నిత్యం తినే కోడిగుడ్డు, చికెన్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. మొన్నటివరకు అందుబాటులో ఉన్న కోడిగుడ్డు ధర కొద్దిరోజుల్లోనే రూ.8.50కు చేరడంతో పేద, గిరిజన కుటుంబాలు దాన్ని కొనుగోలు చేయడానికే వెనకాడుతున్నాయి. ఇక వారాంతంలో సరదాగా ఇంటిల్లిపాదీ చికెన్ తిందామంటే కేజీ లైవ్ డ్రెస్సింగ్ కోడి మాంసం రూ. 350 మార్కును తాకింది. దీంతో ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్‌వైపు వెళ్లడానికే మధ్యతరగతి గృహిణులు వణికిపోయే పరిస్థితులు నెలకొన్నాయి.
కన్నీరు పెట్టిస్తున్న కూరగాయలు
నిత్యావసర సరుకుల బాదుడు ఒకవైపు ఉంటే.. రోజూ వంటల్లో వాడే కూరగాయల కోసం రైతుబజారుకు వెళ్లినా జేబులు చిల్లు పడక తప్పడం లేదు. నామమాత్రపు రేటుకే లభించే టమాటా, ఉల్లిపాయలు సైతం పచ్చడి చేసేలా లేవు. ప్రస్తుతం మార్కెట్లో నడుస్తున్న సగటు కూరగాయల వివరాలు ఇవే..
- టమాటా: కేజీ రూ. 40 నుంచి రూ. 60
- పచ్చిమిర్చి: కేజీ రూ. 40 నుంచి రూ. 60
- ఉల్లిపాయలు: కేజీ రూ. 40 నుంచి రూ. 55
- బెండకాయ / వంకాయ: కేజీ రూ. 40 నుంచి రూ. 50
- క్యారెట్ / బీట్‌రూట్: కేజీ రూ. 50 నుంచి రూ. 60












Click it and Unblock the Notifications