జగన్ కు చెక్: రాష్ట్రంలో సోనియా గాంధీ సీక్రెట్ సర్వే

వైయస్ జగన్ పార్టీ నుంచి వెళ్లిపోయినా, ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకున్నా కాంగ్రెసు పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంపై సర్వే జరిగినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయాలపై కూడా సర్వేలో దృష్టి పెట్టినట్లు సమాచారం. జగన్ పార్టీ పెడితే కాంగ్రెసు పార్టీ పరిస్థితి ఏమిటని అడిగినట్లు తెలుస్తోంది. అలా పెడితే కాంగ్రెసు ఓట్లు చీలుతాయని, చంద్రబాబూ చిరంజీవీ లాభపడుతారనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఆ స్థితిలో ప్రజారాజ్యం పార్టీని కలుపుకుంటే ఆ లోటు భర్తీ అవుతుందా అనే అంశం కూడా ఉంది. గత ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థులకు, పార్లమెంటు అభ్యర్థులకు పడిన ఓట్ల తేడాను కూడా పరిశీలనలోకి తీసుకున్నట్లు చెబుతున్నారు.
ప్రధాని ఎవరైతే బాగుంటుందంటూ అడిగి సోనియా, రాహుల్, మన్మోహన్ సింగ్ తదితరుల పేర్లను ప్రశ్నావళిలో ఇచ్చారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తే మార్పు ఉంటుందా అనే విషయంపై కూడా సర్వేలో దృష్టి పెట్టారు. తెలంగాణ ఇస్తే ఉత్పన్నమయ్యే పరిస్థితి ఏమిటనేది కూడా ప్రశ్నావళిలో మరో అంశం. జగన్ కు ఎక్కువగా ఏ స్థాయిలో ఆదరణ లభిస్తోందనే ప్రశ్న కూడా అందులో ఉంది. పూర్తిగా కింది స్థాయి క్యాడర్ జగన్ వెంట ఉందని, పైస్థాయి క్యాడర్ పార్టీతోనే ఉందని తేల్చుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ నాయకత్వంపై కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. అందుకు కొంత మంది పేర్లు కూడా ఇచ్చింది.












Click it and Unblock the Notifications