కడప: వైయస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది, కడప మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విపక్షాలు తనపై అనపసరంగా రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. తన ఎరువుల వ్యాపారంలో ఎలాంటి అక్రమాలు జరగడం లేదని, వైయస్ ప్రభుత్వం తనను ఎక్కువగా ఏమీ చూడలేదని అన్నారు. విపక్షాలు తనపై 420 కేసు నమోదు అయినట్టు చెబుతున్నారని, అలాంటి కేసు తనపై నమోదు అయినట్లు ఏ పోలీస్ స్టేషన్ లో చూపించినా శాశ్వతంగా రాజకీయాలనుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం వారికి అలవాటుగా మారిందని, రాజకీయ నాయకులంటే వారు అనుకుంటున్నట్లుగా కేవలం వైన్ దుకాణాలు, బార్ లే వ్యాపారం కాదని పేదలకు ఉపయోగపడే ఎరువుల లాంటి, మరే విధమైన ఫ్యాక్టరీలైనా పెట్టుకోవచ్చునని వ్యాఖ్యానించారు. తాను ఎలాంటి నేరాలు చేయలేదని, వారివ్నీ కేవలం ఆరోపణలు మాత్రమే కాని నిజాలు కావన్నారు. అక్రమ వ్యాపారాలు, భూకబ్జాలు, వ్యభిచార గృహాలు నడుపుతున్న రాజకీయ నాయకులపై చర్యలు తీసుకోకుండా తనలాంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడామేమిటని, రాజకీయాలతో పాటుగా వ్యాపారంలోనూ తాను నిజాయితీగా ఉన్నానని వివరించారు.