హైదరాబాద్: రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులపై, జంటనగరాలలో భారీ వర్షాలతో ఏర్పడిన రహదారులు, పారిశుద్ధ్యంపై ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు పురపాలక సంఘాలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో వ్యాధుల్లి అరికట్టాలని రోశయ్య అధికారులకు సూచించారని మంత్రి దానం నాగేందర్ విలేకరుల సమావేశంలో చెప్పారు.హైదరాబాద్ నగరంలో రహదారుల మరమ్మతులకు ఇప్పటికే 32 కోట్ల రూపాయలు కేటాయించామని, జిహెచ్ఎంసి అడిగినందున మరో 50 కోట్లు రూపాయలు ఇవ్వడానికి ముఖ్యమంత్రి సంసిద్దత వ్యక్తం చేసినట్లు దానం చెప్పారు. భారీ వర్షాలకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ పూర్తిగా నిండిపోయాయని, వాటి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని నాగేందర్ హెచ్చరించారు. రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున హైటెక్‌సిటీలో ఉన్న ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభిస్తారని చెప్పారు.రోశయ్య ఆరోగ్యం భేషుగ్గా ఉందని, ఎవరూ గాలి వార్తలు నమ్మవద్దని దానం ప్రజలను కోరారు. ఇక్కడ సమీక్షా సమావేశం ఉన్నందునే రోశయ్య విశాఖ పర్యటన రద్దయిందని ఆయన వివరించారు.