రాయపాటిపై వైయస్ జగన్ క్యాంప్ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఫైర్
State
oi-Pratapreddy
By Pratap
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై వ్యాఖ్యలు చేసిన తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివరావుపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. రాయపాటి వ్యాఖ్యను సాకుగా తీసుకుని ఆయన పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వంటి వ్యక్తి మీద రాయపాటి వ్యాఖ్యలు చేస్తే ఎందుకు చర్యలు తీసుకోరని ఆయన పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించారు. అటువంటి వ్యాఖ్యల వల్ల పార్టీ నష్టం జరగదా అని ఆయన అడిగారు. వైయస్ జగన్ ఓదార్పుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, ఓదార్పు వల్ల పార్టీకి మేలే జరుగుతుందని, అందువల్లనే తాము మద్దతిస్తున్నామని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయపాటి వ్యాఖ్యలపై కాంగ్రెసు పార్టీ నాయకత్వం ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అన్నారు. అధికార పక్షానికి చెందినప్పటికీ వైయస్ జగన్ కు మద్దతిస్తున్నందుకు తమపై పార్టీ నాయకత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేరకంగా రాయపాటి వ్యాఖ్యానించడం ఏ మాత్రం తగదని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర వ్యక్తిగతమైందని ఆయన అన్నారు.