ఎదురు తిరిగిన టిడిపి అధినేత చంద్రబాబు తెలంగాణ వ్యూహం

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రచించి అమలు చేయతలపెట్టిన వ్యూహం ఎదురు తిరుగుతోంది. తెలంగాణపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇంటి వద్ద ధర్నా చేయాలని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులు తీసుకున్న నిర్ణయం చంద్రబాబును ఇరకాటంలో పెట్టింది. తమతో ఏ పార్టీ కూడా అందుకు సిద్దపడదని, కాంగ్రెసు తెలంగాణ రాష్ట్ర సమితి కుమ్మక్కయ్యాయని, ఆ రెండు పార్టీలకు తెలంగాణ సాధనపై చిత్తశుద్ధి లేదని చాటి చెప్పడానికి ఆ వ్యూహానికి తెలంగాణ ప్రాంత నాయకుల చేత చంద్రబాబు శ్రీకారం చుట్టించారు. అయితే, ఇతర రాజకీయ పార్టీలు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాయి. దాంతో చంద్రబాబు ఆత్మరక్షణలో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెరాసనే కాదు, కాంగ్రెసు, బిజెపిలు కూడా చంద్రబాబు తెలంగాణ వైఖరిపై కత్తులు దూస్తున్నాయి. చంద్రబాబును తిప్పికొట్టడానికి ప్రతివ్యూహంతో వ్యవహరిస్తున్నాయి.

తెలంగాణ కోసం సోనియా ఇంటి ముందు టీడీపీ నిర్వహించనున్న ధర్నాకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నేతృత్వం వహిస్తే అందులో పాల్గొనే విషయంపై ఆలోచిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నారు. ధర్నాలో పాల్గొనాల్సిందిగా నాగం జనార్దన్‌రెడ్డి రాసిన లేఖపై ఆయన ఈ విధంగా స్పందించారు. "లేఖ రాసినా స్పందన లేదంటూ నాగం జనార్దన్‌రెడ్డి ఒకటికి మూడుసార్లు చెప్పారు. ఆయనెవరు పిలవడానికి? ఆయన రాసిన లెటర్‌హెడ్‌పై టీడీపీ గుర్తు వేసుకోడానికి కూడా అధికారం లేని వ్యక్తి ఆయన. సార్వత్రిక ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టినదాన్ని, మహానాడులో తీర్మానం చేసిన అంశాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబే పట్టించుకోనప్పుడు మేమెందుకు వారికి సమాధానం చెప్పాలి? డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఢిల్లీలో ఆ పార్టీ వైఖరి ఎందుకు స్పష్టం చేయలేదు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే తెలంగాణపై పార్టీ విధానం ఏమిటో స్పష్టం చేయాలి" అన్నారు.

తెలంగాణ విషయంలో పూటకోమాట మాట్లాడే అలవాటు బీజేపీకి లేదని చెప్పారు. తెలంగాణపై కాంగ్రెస్, టీడీపీలకు కోస్తాంధ్రలో ఓ నాలుక, రాయలసీమలో మరో నాలుక, హైదరాబాద్‌లో ఇంకో నాలుక ఉన్నాయని, ఈ ఉద్రిక్త వాతావరణానికి ఆ పార్టీలే కారణమని ఆరోపించారు. తెలంగాణ కోసం జరిగిన ఆత్మహత్యలకు సోనియాగాంధీ, చంద్రబాబులే బాధ్యత వహించాలన్నారు. వాస్తవానికి తిరిగి లేఖ రాయదలుచుకోలేదని, జనార్దన్‌రెడ్డి బాధలో ఉన్నారనే లేఖ రాస్తున్నానని అన్నారు. తాను రాసిన లేఖను విలేకరులకు విడుదల చేశారు.

టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు తెలంగాణపై పార్టీ అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి నివేదిస్తే సోనియాగాంధీని కలుసుకునేందుకు అపాయింట్‌మెంట్ ఇప్పిస్తానని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కె.కేశవరావు హామీ ఇచ్చారు. ఒక మాజీ సీఎం తనను కలుస్తానంటే అందుకు సోనియా అభ్యంతరం చెప్పరని ఆయన అన్నారు. తెలంగాణపై టీడీపీ తన వైఖరిని శ్రీకృష్ణ కమిటీకి చెప్పుకోవాలన్నారు. టీడీపీ తెలంగాణ నేతలు వ్యక్తిగతంగా ఢిల్లీకి వస్తే దాన్ని పార్టీ వైఖరిగా పరిగణించరని, ముందు వారు ఏ హోదాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారో తేల్చాలన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌కు స్పష్టమైన వైఖరి ఉందని, అయితే కొన్ని విభేదాలు వచ్చినందున వాటిని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు పార్టీ పరంగా మాట్లాడుతున్న విషయాన్ని టీడీపీ నేతల గుర్తించాలని ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ సూచించారు.

తెలంగాణపై తెలుగుదేశం తెలంగాణ ప్రాంత నాయకులు చేపట్టే ఢిల్లీ యాత్రకు చంద్రబాబు నాయకత్వం వహించాలని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ డిమాండ్ చేశారు. చంద్రబాబు లేకుండా ఢిల్లీ యాత్ర వల్ల ఉపయోగం ఉండదని ఆయన ఇటీవల అన్నారు. చంద్రబాబు వైఖరి తేల్చకుండా సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా చేయడంలో అర్థం లేదని తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు అన్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు చేత శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇప్పిస్తే సోనియా ఇంటి ముందు చేసే ధర్నాలో తాను ముందు వరుసలో ఉంటానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+