టెలికం మంత్రి రాజా ఎట్టకేలకు టెలికాం స్కామ్ లో రాజీనామా

రాజా రాజీనామా ఆలస్యమైనకొద్దీ ప్రధాని ప్రతిష్ఠే మసక బారడం, ఆయన్నే లక్ష్యంగా చేసుకొని విపక్షాలు అస్త్రాలు సంధిచడంతో సంకట స్థితిలో పడిన కాంగ్రెస్ అగ్రనేతలు ఆదివారం పార్లమెంటు ప్రాంగణంలో సమావేశం అయ్యారు. నెహ్రూ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి వచ్చిన నేతలు సంక్షోభ నివారణపై చర్చించారు.తాము తప్పించకుండా, రాజాతో రాజీనామా చేయించాలన్నదే కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా కనిపించింది. రాజా ఆదివారం చెన్నైలో డీఎంకే అధినేత కరుణానిధితో అరగంట భేటీ అయ్యారు. ఆందోళనతో లోపలికి వెళ్లిన ఆయన చిరునవ్వుతో బయటికి వచ్చారు. పూర్వాధికార మంత్రులు రూపొందించిన నిబంధనల ప్రకారమే వ్యవహరించానని, ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడనందున రాజీనామా చేసే ప్రశ్నే తలెత్తదని రాజా చెప్పారు. రాజా నేరస్థుడు కాదంటూ కరుణానిధి క్లీన్‌చిట్ ఇచ్చేశారు. అనంతరం రాజా పార్టీ ఎంపీ బాలుతో కలిసి ఢిల్లీకి బయల్దేరారు.
కాగా సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంత్రి రాజాను ప్రశ్నించేందుకు సన్నద్ధం అవుతున్నాయి. కుంభకోణంలో లబ్ధి పొందిన ఒకటి రెండు కంపెనీలతో మంత్రికి ఉన్న సంబంధాలను ఇవి దర్యాప్తు చేస్తున్నాయి. 2008లో జరిగిన స్పెక్ట్రం కేటాయింపుల్లో లబ్ధి పొందిన పలు కంపెనీల ఉన్నతాధికారుల్ని ప్రశ్నించి కొన్ని ఆధారాలను రాబట్టినట్లు సమాచారం. దర్యాప్తు జరిగిన కంపెనీల్లో యూనిటెక్ వైర్‌లెస్ స్వాన్ టెలికాం, ఎస్ టెల్, టాటా టెలీ సర్వీసెస్, డాటాకాం సర్వీసెస్ ఉన్నాయని ధ్రువీకరించని వర్గాలు చెబుతున్నాయి. ఈ సంస్థల విదేశీ అనుబంధ సంస్థల్లో టెలికం ఉన్నతాధికారులకు ఉన్నాయంటున్న బినామీ వాటాల గురించి ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు శనివారం సమావేశమై దర్యాప్తు వ్యూహాన్ని చర్చించారు. దర్యాప్తు పురోగతి సమాచారం ఇవ్వాలని టెలికం శాఖ ఉన్నతాధికారులు, న్యాయవాదులు అడిగినపుడు 'విరోధ ప్రయోజనాల' కారణం పేర్కొంటూ సీబీఐ, ఈడీలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించాయి.












Click it and Unblock the Notifications