యడ్యూరప్ప కూల్చివేతకు గాలి జనార్దన్ రెడ్డి కుట్ర

ఆ చానెళ్లు ప్రసారం చేసిన వీడియో టేపుల ప్రకారం - "యడ్యూరప్ప ప్రభుత్వాన్ని గవర్నర్‌తో రద్దు చేయిస్తే మీకు రూ.ఐదు కోట్లు...ఆ వ్యక్తికి రూ.15 కోట్లు ఇస్తాను" అని గాలి భరోసా ఇచ్చారు. రూ.15 కోట్లు పుచ్చుకునే ఆ అజ్ఞాత వ్యక్తి ఎవ్వరు?, భేటీలో పాల్గొన్న మూడో మనిషి ఎవ్వరనేది తెలియడం లేదు. "యడ్యూరప్ప అబద్ధాల కోరు. మా నుంచి సహాయాల్ని పొందుతారు, సలహాల్ని తీసుకుంటారు. మమ్మల్నే ఇబ్బందుల పాల్జేస్తున్నారు. ఆయన కంటే ఈశ్వరప్ప (భాజపా రాష్ట్ర అధ్యక్షుడు), అనంతకుమార్ (భాజపా ప్రధాన కార్యదర్శి) ఎంతో విశ్వసనీయులు. అసెంబ్లీలో యడ్యూరప్ప అక్రమ గనుల తవ్వకాల్ని రద్దు చేస్తామంటారు. విపక్షాల్ని మాకు వ్యతిరేకంగా రెచ్చగొడతారు.." అంటూ ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు.
జనార్దనరెడ్డి వినతికి అశోక్ శర్మ సానుకూలంగా స్పందించారు. వీలైనంత త్వరగా యడ్యూరప్ప సర్కారును కూల్చివేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. అక్రమ గనుల తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పాదయాత్ర జరిపి బళ్లారిలో గత ఆగస్టు 9న భారీ బహిరంగ సభ నిర్వహించింది. అది జరిగిన రెండు రోజుల తర్వాత జనార్దనరెడ్డి నగరంలోని హోటల్లో అశోక్ శర్మతో మంతనాలు సాగించారు. ఈ టేపుల చర్చల్లో రాజ్‌భవన్, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ పేర్లూ ప్రస్తావనకు వచ్చాయి. శర్మకు జనార్దనరెడ్డి మొత్తం మూడు విన్నపాలు చేశారు. అవి యడ్యూరప్పను ముఖ్యమంత్రి గద్దె నుంచి దించాలి. లాభదాయక పదవుల కేసులో ఎన్నికల సంఘం తనపై క్రమశిక్షణ చర్యల్ని తీసుకోకుండా అడ్డు చక్రాన్ని వేయాలి. తనపై సీబీఐవిచారణ జరపకుండా చూడాలి. వీలైతే తనను ముఖ్యమంత్రి పదవిలో నియమించేలా చూడాలనీ విన్నవించారు.
సీడీపై మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. అది టీవీ 9 ఛానల్ సృష్టించిన కట్టు కథ అని ఆరోపించారు. ఆ ఛానల్‌పై కేసు వేస్తానన్నారు. ఆదివారం ఆయన బళ్లారిలో విలేఖరులతో మాట్లాడారు. కొందరు ఆ సీడీని సృష్టించి ఒక ఛానల్‌కు ఇచ్చారని ఆరోపించారు. "సీడీయే బూటకమైనప్పుడు, అందులో ఉన్నది నేనెలా అవుతాను" అన్నారు. ఎప్పుడూ కౌంటర్లు వేస్తూ ఉత్సాహంగా మాట్లాడే జనార్దన్‌రెడ్డి మొహం తాజా సీడీతో వెలవెలబోయింది.












Click it and Unblock the Notifications