జెసి దివాకర్ రెడ్డిని మంత్రివర్గం నుంచి ఎందుకు దూరం పెట్టారు?

జెసి దివాకర్ రెడ్డికి కాంగ్రెసు అధిష్టానం వద్ద కూడా పెద్దగా ప్రాబల్యం లేదు. వైయస్ జగన్ కు ఆయన బద్దవిరోధిగా వ్యవహరించారు. వైయస్ జగన్ ను ఎదుర్కోవడంలో ఆయన కడప జిల్లాకు చెందిన శాసనసభ్యుడు డిఎల్ రవీంద్రారెడ్డి మాదిరిగా హుందాగా వ్యవహరించలేదనే అభిప్రాయం కూడా ఉంది. పైగా, రఘువీరా రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం కిరణ్ కుమార్ రెడ్డికి అనివార్యంగా మారింది. దివంగత నేత వైయస్సార్ కు అనుంగు శిష్యుడైనప్పటికీ రఘువీరా రెడ్డి వైయస్ జగన్ ను ప్రోత్సహించలేదు. పార్టీతోనే ఉంటానని ఆచరణలో చూపుతూ వచ్చారు. వైయస్ జగన్ కు నచ్చజెప్పడానికి కూడా ప్రయత్నించారు. తన మాట వినకపోవడంతో వైయస్ జగన్ కు దూరమయ్యారు. దాంతో రఘువీరా రెడ్డికి తప్పనిసరిగా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. దానికితోడు, అనంతపురం జిల్లా నుంచి ఎస్సీ అయిన శైలజానాథ్ కు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. రఘువీరారెడ్డి, జెసి దివాకర్ రెడ్డిలో ఎవరో ఒక్కరికి మాత్రమే ఇవ్వాల్సిన స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి రఘువీరారెడ్డి వైపు మొగ్గు చూపారు.
ఇదిలా వుంటే, నిరుడు డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటించిన తర్వాత తొలుత రాజీనామా సమర్పించింది జెసి దివాకర్ రెడ్డే. చిదంబరం ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర శానససభ్యులను కూడగట్టి రాజీనామాలు చేయించారు. తెలంగాణ వ్యతిరేక ఉద్యమానికి ఆయన నాయకత్వం వహించారు. ఇది కూడా జెసి దివాకర్ రెడ్డికి ప్రతికూలాంశమే అయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications