సిఎం కిరణ్ పై బల ప్రదర్శనకు సిద్ధమవుతున్న వైఎస్ జగన్!

కడప పార్లమెంటు సభ్యత్వానికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వైఎస్ జగన్ తన పార్టీని, విధివిధానాలను కడపలోగానీ, ముఖ్యమంత్రి సొంత జిల్లా చిత్తూరులోగానీ భారీ బహిరంగసభను పెట్టి ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే సభ పెట్టి ఆయన జిల్లాలో తన సత్తా చాటుకోవడమా, లేదా కడప, పులివెందలలో ఉప ఎన్నికలు ఉన్నందున కడప జిల్లాలోనే పెట్టడమా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ నెలాఖరు వరకు అంతర్గతంగా పార్టీ రూపకల్పనను పూర్తి చేసుకొని జవనరిలో తమకు ఎంత ప్రజాబలం ఉందో నిరూపించాలనుకుంటున్నారు. అయితే చిత్తూరు, కడపలలో ఎక్కడ జరిపినా సభను భారీగా నిర్వహించగలమని అనుకుంటున్నారు.
డిసెంబర్ 31న శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్రానికి అందించడానికి ముందు తమ బలాన్ని కేంద్రానికి, శ్రీకృష్ణ కమిటీకి తెలియజెప్పే ఆలోచనలో తెరాస ఉంది. అందులో భాగంగానే మరో నాలుగు రోజుల్లో డిసెంబర్ 9న వరంగల్లో బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఇక్కడకు బల ప్రదర్శన ద్వారా కేంద్రానికి హెచ్చరికలు పంపే యోజనలో తెరాస ఉంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత అవసరమైతే మరోసారి ఉద్యమానికి తమ పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు సైతం ఈ సభ ఉపయోగపడుతుందని తెరాస భావిస్తోంది.
తెలుగుదేశం పార్టీ సైతం ఈ నెల 20 తర్వాత ఎప్పడైనా కేంద్ర ప్రభుత్వం ఇరుక్కుపోయిన కుంభకోణాల విషయం ప్రజలకు మరింత చేరువ చేయడానికి జాతీయ పార్టీలతో రాష్ట్ర రాజధానిలో బహిరంగ సభకు పూనుకొంది. 2జి స్పెక్ట్రం, ఆదర్శ్, కామన్వెల్తు తదితర కుంభకోణాల్లో యూపిఏ పాలన పూర్తిగా కూరుకు పోయిందని కాంగ్రెస్ అంటేనే అవినీతి అడ్డా అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు జాతీయ పార్టీలను సంప్రదించినట్టు సమాచారం. ఈవిషయమై తెలుగుదేశం పార్టీ నేతలు కూడా త్వరలో కుంభకోణాలపై భారీ బహిరంగ సభ నిర్వహించే ఉద్దేశ్యం ఉన్నట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో కుంభకోణాలతో, రాష్ట్రంలో వైఎస్ జగన్ వంటి అంతర్గత కలహాల్లో మునిగిపోయిందని చెప్పడానికి తెలుగుదేశం ప్రజల ముందుకు వెళ్లనుంది.












Click it and Unblock the Notifications