వైయస్ జగన్ ప్లాన్ కిరణ్ కుమార్ ప్రభుత్వాన్ని పడగొట్టడమేనా?

వైయస్ జగన్ కు చాటుమాటుగా కూడా పలువురు శాసనసభ్యులు మద్దతు తెలుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ తలుచుకుంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని అస్థిరం పాలు చేసే శక్తి ఉందని అంటున్నారు. మరో 20 మంది శాసనసభ్యులను వైయస్ జగన్ తన వైపు తిప్పుకోగలిగితే ప్రభుత్వాన్ని కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుకోవడం కష్టమే అవుతుంది. కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని ధిక్కరిస్తూ 18 శాసనసభ్యులు వైయస్ జగన్ కు మద్దతు తెలిపడంలోని వ్యూహం ఏమిటనేది తెలియడం లేదు. అధిష్టానం శాసనసభ్యులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి రంగంలోకి దిగాలనేది వైయస్ జగన్ వ్యూహం చెబుతున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం చర్యలను ధిక్కరిస్తూ వారంతా బయటకు రావచ్చు. అయితే, అధిష్టానం చర్యలు తీసుకుంటుందా అనేది అనుమానంగానే ఉంది.
వైయస్ జగన్ దీక్షలో శాసనసభ్యులు పాల్గొనడం తప్పు కాదని మాజీ ముఖ్యమంత్రి కె. రోశయ్య అనడంలోని ఆంతర్యం బోధపడడం లేదు. ఆయన అధిష్టానం సూచన మేరకే ఆ విధంగా అన్నారా, మరో ఉద్దేశంతో అన్నారా అనేది అర్థం కావడం లేదు. డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత రాజకీయ సమీకరణాలు మరింతగా మారే అవకాశం ఉంది. డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణ శాసనసభ్యులు తమ కార్యాచరణకు పదును పెడితే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ఆస్థిరత్వంలో పడిపోతుందని వైయస్ జగన్ ఊహిస్తున్నట్లు సమాచారం. అప్పుడు ప్రభుత్వాన్ని కాపాడడం ఎవరి వల్లా కాదని అంటున్నారు. అప్పటి వరకు తన వైపు ఉన్న బలాన్ని ప్రదర్సించి, అధిష్టానాన్ని కలవర పెట్టాలనేది కూడా వైయస్ జగన్ వ్యూహం కావచ్చు. మొత్తం మీద, వైయస్ జగన్ అనూహ్యమైన బలప్రదర్శనే చేశారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications