వైయస్ జగన్ ఇష్యూతో అవసరమైతే రాష్ట్రపతి పాలన: రిపోర్ట్

పరిపాలనను సజావుగా సాగించలేని పరిస్థితిలో ఉన్నా, శాంతి భద్రతలకు విఘాతం కలిగినా, ప్రభుత్వంలో అస్థిరత నెలకొన్నా, తగిన శాసనసభ్యుల బలం లేకుండా పోయినా ఆర్టికల్ 365 కింద రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అత్తెసరు మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ 148 కంటే 7 స్థానాలు మాత్రమే అధికంగా ఉన్నాయి. మరో ముగ్గురు శాసన సభ్యులు కాంగ్రెస్‌కు అనుబంధంగా కొనసాగుతున్నారు. వైఎస్ సతీమణి విజయలక్ష్మి రాజీనామా చేయడంతో పులివెందుల స్థానం ఖాళీగా ఉంది. అత్తెసరు మెజారిటీ ఉన్న నేపథ్యంలో ఏమాత్రం అటూ ఇటూ అయినా ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. దీంతో ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు.
వైయస్ జగన్ కు సానుకూలంగా శాసనసభ్యులు కొంత మంది అధిష్టానాన్ని ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ స్థితిలో జగన్ 40 మందికిపైగా ఎమ్మెల్యేలను కూడగట్టుకుంటే కాంగ్రెస్ పరిస్థితి అడకత్తెరలో పొక చెక్కలా మారుతుంది. పీఆర్పీ, ఎంఐఎంలు ప్రభుత్వానికి బేషరతుగా మద్దతు ఇచ్చే అవకాశం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అప్పుడు పూర్తి రక్షణాత్మక వైఖరి ప్రదర్శించకుండా, శాసనసభను సుప్త చేతనావస్థలో ఉంచి, ఆరు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించడమే సమస్యలన్నింటికీ పరిష్కారమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications