దిగొచ్చిన మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి: అసెంబ్లీలో క్షమాపణలు

దేవుడి లాంటి వైయస్ రాజశేఖర రెడ్డిని తెలుగుదేశం పార్టీ సభ్యులు అనరాని మాటలన్నారని, దాన్ని భరించలేకపోయానని ఆయన అన్నారు. వైయస్ ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం వారు ఇలాగే ఆరోపణలు చేసేవారని, వాటిని వైయస్ నవ్వుతూ స్వీకరించేవారని ఆయన అన్నారు. తాను తన కుటుంబం కన్నా వైయస్సార్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చానని ఆయన అన్నారు. వైయస్సార్ దూషించడమే తెలుగుదేశం సభ్యులు లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన అన్నారు.
సాయంత్రం సభ సమావేశం కాగానే తెలుగుదేశం సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. వైయస్ వివేకానంద రెడ్డిని బర్తరఫ్ చేయాలని వారు కోరారు. జరిగిన దాడికి విచారం వ్యక్తం చేయకుండా గొప్పలు చెప్పుకుంటున్నారని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - వైయస్ వివేకానంద రెడ్డి తరఫును తాను క్షమాపణలు చెబుతున్నానని అన్నారు.
జరిగిన సంఘటన దురదృష్టకరమని ఆయన అన్నారు. అలాంటి సంఘటనలు సభకు మర్యాద కాదని ఆయన అన్నారు. జరిగిన సంఘటనకు క్షమాపణ చెప్పిన తర్వాత దానిపై చర్చ చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగినప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయని, విధానాలూ అంశాలపై చర్చ జరిగితే ఇలా ఉండదని ఆయన అన్నారు. చర్చ జరిగిన తర్వాత భూకేటాయింపులపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పామని ఆయన గుర్తు చేశారు. చర్చ జరగకుండా విచారణకు ఆదేశించడం సరి కాదని ఆయన అన్నారు.
ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మాట్లాడుతూ - రాజకీయాల్లో ఉన్నప్పుడు విమర్సించే హక్కు తమకు ఉందని అన్నారు. రౌడీయిజం చేస్తే భయపడేది లేదని ఆయన అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తమ కన్నా దారుణంగా మాట్లాడారని ఆయన అన్నారు. మరణించిన వ్యక్తి గురించి మాట్లాడడం సరి కాదని, అలా మాట్లాడితే సహించబోమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ గురించి తాము మాట్లాడబోమని ఆయన అన్నారు. తాము చనిపోయిన వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం లేదని, ప్రభుత్వ హయాంలో జరిగిన వ్యవహారాలపై మాట్లాడుతున్నామని ఆయన అన్నారు. డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభ్యులకు సర్ది చెప్పారు. దాంతో సభ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications