కాంగ్రెసు స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న చిరు, సిఎంకు సహకరించని అధిష్టానం

శనివారం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెసు ప్రభుత్వం అస్థిరత్వంలో పడిందని ప్రచారంలో వోటర్లను ఉద్దేశించి చిరంజీవి వ్యాఖ్యలు
చేశారు. జగన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కిరణ్ ప్రభుత్వాన్ని అస్థిరత్వంలోకి నెట్టారని, అందుకే తాను కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి పూనుకున్నానని చెప్పారు. అంతేకాకుండా గత సాధారణ ఎన్నికలలో వైయస్‌పై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా విలీనం ప్రకటన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చిన సమయంలో వైయస్‌ను విమర్శించారు. వైయస్‌ను నిన్నటిదాకా విమర్శించి ఇప్పుడు పొగడటంపై కడప వోటర్లు జీర్ణించుకోలేక పోతున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా చిరు పూర్తిగా కేవలం అక్రమాలపైనే కేంద్రీకరించారు. కాంగ్రెసు వల్ల చేకూరే లబ్ధిపై ఓటర్లకు అంతగా చెప్పినట్లుగా కనిపించడం లేదు.
ఇక ఉప ఎన్నికలలో రాష్ట్రానికి కేంద్రం నుండి కూడా ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదని తెలుస్తోంది. మే మొదటి వారంలో రాష్ట్ర ఇంఛార్జ్ గులాం నబీ అజాద్, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఉప ఎన్నికలలో ప్రచారం చేస్తారనే వార్తలు వచ్చాయి. అయితే డిఎస్ ఇటీవలే కంటికి శస్త్ర చికిత్స చేసుకున్నందున వైద్యుల సూచనల మేరకు పాల్గొంటానని చెప్పారు. అలా చెప్పినప్పటికీ ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక ఆజాద్ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం లేదని సమాచారం. దీంతో ఇప్పటి వరకు ఆజాద్, డి శ్రీనివాస్ ప్రచారంలో పాల్గొంటారని ఆశలు పెట్టుకున్న కడప కాంగ్రెసు కార్యకర్తలు పూర్తి నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మొదట వారు వస్తారని చెప్పి ఇప్పుడు రాకపోవడంతో కడపలో ప్రజలలోకి నెగిటివ్‌గా వెళ్లే అవకాశం ఉందని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications