నాగం జనార్దన్ రెడ్డి ప్లాన్: కొత్త పార్టీ లేదా జగన్ పార్టీ బలోపేతం?

Nagam Janardhan Reddy
హైదరాబాద్: పార్టీలోనే ఉంటూ పార్టీనీ, పార్టీ అధినేతను నిత్యం ఇక్కట్లకు గురి చేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ పెట్టనున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీలోనే ఉంటూ పార్టీ జెండా పెట్టకుండా తెలంగాణ సభలు నిర్వహించడం జెండా లేకుండా సభలు ఏమిటని పార్టీ ప్రశ్నిస్తే పార్టీ అధిష్టానం తెలంగాణపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటే పార్టీ జెండా పెట్టడానికి సిద్ధం అని ఆయన ఎదురు సమాధానం చెబుతూ చంద్రబాబు గొంతులో పచ్చి వెలక్కాయలా తయారయ్యాడు. నాగం తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేతతో పాటు, ఇటు సీమాంధ్ర, అటు తెలంగాణ నేతలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగంపై చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర నేతలు డిమాండ్ కూడా చేస్తున్నారు. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న నాగంపై చర్యలు తీసుకుంటే పార్టీపై వ్యతిరేక ముద్ర పడుతుందన్న భావనతో అధిష్టానం మిన్నకుండి పోతోంది. అయితే అధిష్టానం ఎంతగా మిన్నకుండినప్పటికీ నాగం మాత్రం పార్టీని రోజురోజుకు అంతకంటే ఎక్కువగానే ఇరుకున పెడుతున్నారు. కాలం చెల్లిన ప్రణబ్ కమిటీకి కాకుండా చిదంబరానికి పార్టీ లేఖ రాయాలని రెండు రోజుల క్రితం నాగం అధిష్టానాన్ని డిమాండ్ చేయడంతో పార్టీకి, నాగంకు మధ్య గొడవ ముదిరి పాకాన పడినట్టుగా కనిపిస్తోంది.

ఇప్పటి వరకు టిడిపి ప్రణబ్‌కు లేఖ రాశామని చెప్పుకొచ్చేది. నాగం వ్యాఖ్యలతో వారు చెప్పుకునే మాటలకు విలువ లేకుండా పోయింది. అయితే నాగం జనార్ధన్ రెడ్డి ఇదంతా వట్టిగనే చేయడం లేదని, తెలంగాణలో టిడిపిని నిర్వీర్యం చేసి తదనంతరం ఓ పార్టీ పెట్టాలనే ముందస్తు వ్యుహంతోనే ఇలా పార్టీనే ధిక్కరించే సాహసం చేస్తున్నారనే వారూ ఉన్నారు. నాగం వెనుక వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా ఉన్నారనే వార్తలు వచ్చాయి. ఇప్పటికే సీమాంధ్రలో గట్టి పట్టు సాధించిన జగన్, తెలంగాణలో కూడా పట్టు సాధించే ఉద్ధేశ్యంలో భాగంగా ఇటు టిడిపిని, అటు టిఆర్ఎస్‌ను దెబ్బతీస్తూ తన పార్టీని చాపకింద నీరులా తెచ్చే ప్రయత్నాలలో భాగంగా నాగంను ఉపయోగించుకుంటున్నట్టు కథనాలు వస్తున్నాయి. నాగం చర్యలు కూడాసొంత పార్టీ పెట్టడమో, మరో పార్టీనో తెలంగాణలో బలోపేతం చేయడమో అన్నట్టుగా ఉండటంతో పలువురిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ఇన్నాళ్లూ టిఆర్ఎస్ పార్టీ రాజ్ న్యూస్ ఛానల్‌ను అద్దెకు తీసుకొని ప్రసారాలు చేసింది. అయితే ఇటీవలే తెలంగాణ ఛానల్‌కు అనుమతులు రావడంతో వారు రాజ్ న్యూస్‌ను పక్కన పెట్టేసి టి ఛానల్‌తో ప్రసారాలు కొనసాగిస్తున్నారు. ఇన్నాళ్లూ టిఆర్ఎస్ వద్ద ఉన్న రాజ్ న్యూస్ ఛానల్‌ను నాగం జనార్ధన్ రెడ్డి తీసుకుంటాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ న్యూస్ కోసం ఆయన వాకబు కూడా చేసినట్లుగా తెలుస్తోంది. రాజ్ న్యూస్ యాజమాన్యానికి టిఆర్ఎస్ నెలకు 15 లక్షల రూపాయలు ఇచ్చేది. నాగం అంత పెద్ద మొత్తం ఇస్తే తాము ఇవ్వడానికి సిద్ధమని యాజమాన్యం చెప్పినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు ఛానల్ నడపడానికి నెలకు మరో 50 లక్షల రూపాయల వరకు అవసరం అవుతాయి. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని నాగం ఎలా భరించగలడు అంటే ఆయనకు ఆర్థికంగా బలవంతుడైన ఒక రాజకీయ నాయకుడి అండ ఉండటం వల్లనే సొంత పార్టీని ఇబ్బందులకు గురి చేస్తూ తెలంగాణపై సొంత ఉద్యమం చేపడుతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే నాగం సొంత పార్టీ పెట్టడమో, జగన్ పార్టీని పరోక్షంగా తెలంగాణలో బలోపేతం చేయడమో లక్ష్యంగా పని చేస్తున్నాడని టిడిపి నేతలు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+