ఆ ఎంపీ జగన్ కోవర్టు!: అధినేత చంద్రబాబుకు గుంటూరు నేతల ఫిర్యాదు

కోస్తాంద్ర జిల్లాల్లో టిడిపి పార్టీని నిర్వీర్యం చేయడానికి పార్టీలోనే ఉంటూ జగన్‌తో నిత్యం సంప్రతింపులు జరుపుతున్నారని వారు ఆరోపిస్తూ అధినేతకు ఫిర్యాదు చేశారు. గత సాధారణ ఎన్నికలకు ముందే రాజకీయాల్లోకి ప్రవేశించి అనూహ్యంగా టిడిపి నుండి టిక్కెట్ సాధించి అనుకోకుండా గెలిచిన సదరు ఎంపీ ఇటీవల జగన్‌తో నిత్యం సత్సంబంధాలు కొనసాగిస్తున్నాడని వారు ఆరోపించారు. జగన్ వైపు వెళ్లడానికి చూస్తున్న ఆ ఎంపీ మున్నుందు పార్టీలో ఉంటాడన్న గ్యారెంటీ లేదని కూడా వారు చెప్పారు.
కాబట్టి ఆయనపై ఇప్పటి నుండే దృష్టి సారించాలని వారు అధినేతను కోరారు. ఆ ఎంపీపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకోకుంటే కోస్తాంద్ర ప్రాంతంలో పార్టీ పరిస్థితి కనుమరుగు కావడం ఖాయమని వారు అధినేత వద్ద ఆందోళన చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీలో ఉంటూనే జగన్ పార్టీని సదరు ఎంపీ చాపకింద నీరులా ప్రవహింప చేస్తున్నారని, ఇప్పటికే జగన్ పార్టీలో ఆ ఎంపీ బావమరిది ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని కూడా అధినేత దృష్టికి తీసుకు వచ్చారు.