తెలంగాణపై వైయస్ జగన్ వైఖరి స్పష్టమేనా?

తెలంగాణపై ఢిల్లీ పరిణామాలను చూసిన తర్వాతే స్పందించాలని అభిప్రాయం కూడా పార్టీలో వ్యక్తమవుతోంది. తెలంగాణకు అనుకూలంగా ప్లీనరీలో తీర్మానం చేయాల్సిందేనని తెలంగాణ ప్రాంత నేతలు డిమాండు చేస్తున్నారు. వివిధ అంశాలపై చేస్తున్న తీర్మానాల్లో భాగంగా తెలంగాణపైన కూడా ఓ తీర్మానం చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పార్టీ అధికార ప్రతినిధి బాజిరెడ్డి గోవర్దన్ తదితర నేతలు తెలంగాణ విషయమై పార్టీలో అంతర్గతంగా చర్చిస్తున్నారు. తెలంగాణపై ఎటూ తేల్చుకోలేని స్థితిలో క్షేత్రస్థాయి భావోద్వేగాలను అంచనా వేసేందుకు తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లో పార్టీ ప్రత్యేకంగా సర్వేలు చేయించింది. ఆ సర్వేల ఫలితాలను ప్రస్తుతం చర్చిస్తున్నట్లు తెలిసింది. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామా నేపథ్యంలో తెలంగాణ అంశంపై ఢిల్లీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడి నుంచి ఏదో ఒక ప్రకటన వెలువడిన తర్వాత పార్టీ పరంగా నిర్ణయం తీసుకుందామని పార్టీ నేతలు జగన్‌కు సూచించినట్లు సమాచారం.
గురువారం సాయంత్రానికి తెలంగాణపై పార్టీ వాదన ఏమిటనేది ఒక కొలిక్కి వస్తుందని ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు తెలిపారు. 'ప్లీనరీలోనే పార్టీ వైఖరిని వెల్లడిద్దాం' అని జగన్ కూడా నేతలకు స్పష్టం చేశారు. శుక్ర, శనివారాల్లో ఇడుపులపాయలో జరగుతున్న పార్టీ ప్లీనరీ నేపథ్యంలో జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం కడపకు బయల్దేరి వెళ్లారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నేత కళ్లెం బాలిరెడ్డి బుధవారం జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.












Click it and Unblock the Notifications