హైదరాబాద్: పార్టీ సీమాంధ్ర నాయకులకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. సమైక్యాంధ్ర నినాదంతో ఆందోళనలు, ప్రకటనలు చేయడంపై సీమాంధ్ర సీనియర్ నాయకుల మీద ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమైక్యాంధ్ర నినాదంతో పార్టీ సీనియర్ నేత కె. ఎర్రంనాయుడు పాదయాత్ర చేపట్టారు. విజయవాడకు చెందిన దేవినేని ఉమా మహేశ్వర రావు, నెల్లూరు జిల్లాకు చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలంగాణ ఇస్తే రాష్ట్రం భగ్గుమంటుందని, తాము వ్యతిరేకిస్తామని ప్రకటనల మీద ప్రకటనలు చేస్తున్నారు. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు ఇరకాటంలో పడ్డారు. తెలంగాణ పార్టీ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బస్సు యాత్ర చేపట్టడం, అదే సమయంలో సీమాంధ్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడం వల్ల పార్టీ ద్వంద్వ వైఖరి బయటపడుతుందనే ఉద్దేశంతో చంద్రబాబు సీమాంధ్ర నాయకులను హెచ్చరించినట్లు చెబుతున్నారు.
తమ బస్సు యాత్రకు చంద్రబాబు అనుమతించారని, చంద్రబాబు తెలంగాణకు వ్యతిరేకం కాదని చెబుతూ బస్సు యాత్రలో తెలంగాణ నాయకులు ఊదరగొడుతున్నారు. ఈ స్థితిలో సీమాంధ్ర నాయకులు తెలంగాణను వ్యతిరేకిస్తూ పాదయాత్రలు, ప్రకటనలు చేయడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. సీమాంధ్ర నాయకులకు కూడా చంద్రబాబు అనుమతి ఉందా, ఇటు తెలంగాణ నాయకులను, అటు సీమాంధ్ర నాయకులను ప్రోత్సహించి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని బయటపెట్టుకుంటున్నారని ఇతర పార్టీల నుంచి ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఉనికి కోల్పోయి ప్రమాదంలో పడిన పార్టీని బస్సు యాత్ర ద్వారా తెలంగాణ నాయకులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఈ స్థితిలో సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్ర కోసం ముందుకు వస్తే తెలంగాణలో మళ్లీ కష్టాలు మొదలపుతాయని ఆయన చెప్పినట్లు సమాచారం.