రగులుతున్న సీమాంద్ర, రాజీనామాలకు నేతలు దూరం

విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. అయితే రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని సీమాంధ్ర నాయకులు చెబుతున్నారు. 2009 డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ప్రకటించగానే సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలకు దిగారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తారని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ప్రకటించినప్పటికీ రాజీనామాలకు కాంగ్రెసు సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు దూరంగా ఉండదలిచినట్లు తెలుస్తోంది.
తాము రాజీనామాలు చేయబోమని మంత్రులు డిఎల్ రవీంద్రా రెడ్డి , ఎరాసు ప్రతాప రెడ్డి వంటివారు ఇప్పటికే ప్రకటించారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని మంత్రి మాణిక్యవరప్రసాద్ అన్నారు. రాజీనామాలు అవసరం లేదని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. గతంలో మొదట రాజీనామా చేసిన ప్రజాప్రతినిధి ఆయనే. అయితే, తెలంగాణ రాదని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.