విజయవాడ: బెజవాడ రౌడీలు చిత్రం టైటిల్ మార్చాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ప్రజలు సోమవారం చిత్రం షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఆందోళన చేపట్టారు. విజయవాడలో జరుగుతున్న షూటింగ్ ప్రాంతానికి స్థానికులు చేరుకొని రామ్ గోపాల్ వర్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే టైటిల్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. పేరు మార్చకుంటే సినిమాను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.
కాగా బెజవాడ చిత్రం షూటింగుకు ఎలాంటి అవాంతరాలు రావద్దని కోరుతూ రామ్ గోపాల్ వర్మ శాంతి హోమం చేసిన విషయం తెలిసిందే. దైవ భక్తి లేని వర్మ శాంతిహోమం చేయడం పట్ల పలువురు విస్మయం చెందారు. చిత్రం హీరో నాగ చైతన్య తండ్రి, ప్రముఖ హీరో నాగార్జున ఆదివారం విజయవాడ వచ్చిన సందర్భంలో బెజవాడ రౌడీలు టైటిల్ పైన స్పందించడానికి నిరాకరించారు. ఆ టైటిల్ పై వర్మను, చైతునే ప్రశ్నించాలని సూచించారు.