భాను కిరణ్ సమాచారా వ్యవస్థపై కన్నేసిన సిఐడి

సూరి హత్యకేసులో ప్రధాన నిందితుడు, నేరాలు చేయడంలో ఆరితేరిన భానుకిరణ్ ఉదంతంలోనూ కొరియర్లు చాలా మంది ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి అతని కదలికలు కూడా తెలిసి ఉంటాయి కాబట్టి వారి ఆచూకీని కనుగొనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట సాధారణ పద్ధతుల్లో భాను బంధువులు, స్నేహితులు, సన్నిహితులపై పోలీసులు నిఘా పెట్టారు. సాధారణంగా అజ్ఞాతంలో ఉన్న నేరగాళ్ళు కొద్దిమందిని అయినా వ్యక్తిగతంగా కలవడమో, కనీసం ఫోన్ ద్వారా అయినా సంబంధాలు నెరపడమో చేస్తుంటారు. ఈ సమాచార వ్యవస్థలోకి చొచ్చుకొని పోగలిగితే నిందితుణ్ని పట్టుకోవచ్చు. భాను విషయంలోనూ పోలీసులు ఇదే పంథా అనుసరించారు.
వివిధ నేరాలకు సంబంధించి అనేకమార్లు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కిన భాను వారి దర్యాప్తు తీరుతెన్నులను దగ్గర నుంచి గమనించాడని, ఈ అనుభవంతో తప్పించుకోవడంలో మెలకువలు నేర్చుకున్నాడని, ఇప్పుడు వాటిని అమలు చేస్తున్నాడని అంటున్నారు.