ఆజాద్‌తో హైదరాబాదుపై తెలంగాణ నేతల చర్చ

Ghulam Nabi Azad
న్యూఢిల్లీ: రాష్ట్ర కాంగ్రెసు వ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్‌తో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకుల రెండో దఫా చర్చలు బుధవారం ఉదయం పది గంటలకు జరుగుతాయి. సోమవారం నాటి తొలి సమావేశంలో తెలంగాణ చరిత్ర, కాంగ్రెస్‌ వాగ్దానాల గురించి చర్చించిన నాయకులు బుధవారం అభివృద్ధి అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. సీమాంధ్ర నేతలు ప్రధానంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న హైదరాబాద్‌, మంచినీటి సమస్యలు ఈ సమావేశంలో ప్రధాన చర్చనీయాంశాలు కానున్నాయి. అభివృద్ధి విషయంలో గత 55 ఏళ్లలో తెలంగాణకు జరిగిన అన్యాయం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల్లో వెనుకబాటుతనం గురించి కాంగ్రెస్‌ నేతలు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.

కొన్నాళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచి రాష్ట్రాన్ని విభజించాలంటూ కొందరు తెలంగాణ ప్రాంత నేతలు చేస్తున్న డిమాండూ ఈ సందర్భంగా చర్చకు రానున్నట్లు సమాచారం. సాగునీటి అంశంపై చర్చించడానికి నీటిపారుదలరంగ నిపుణులు విద్యాసాగర్‌రావు, మాజీ రిటైర్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు శ్యాంప్రసాద్‌రెడ్డిలను తీసుకెళ్తున్నారు. రాష్ట్రం విడిపోతే రెండు ప్రాంతాల మధ్య సాగునీటి సమస్యలు తలెత్తుతాయన్న వాదనల్లో నిజం లేదని తెలంగాణ నేతలు వాదిస్తున్నారు. ఈ అంశాన్ని తేల్చడానికి ట్రైబ్యునళ్లు ఉన్నాయని చెప్పనున్నారు. సీమాంధ్ర- తెలంగాణల మధ్య ప్రవహించేది కృష్ణా, గోదావరి నదులేనని, వీటిని ప్రాంతాల వారీగా వాడుకోవడానికి రెగ్యులేటరీ బోర్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని పేర్కొంటున్నారు.

రాష్ట్ర విభజనకు సీమాంధ్రులు సుముఖంగా ఉన్నా హైదరాబాద్‌ ఒక్కటే వారికి అభ్యంతరంగా ఉన్నందున కొన్నాళ్లపాటు దీన్ని ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయడానికి అభ్యంతరం లేదని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చెప్పే అవకాశాలున్నాయి. సీమాంధ్రులు కొత్త రాజధానిని అభివృద్ధి చేసుకునేంతవరకూ భాగ్యనగరం వేదికగా వారు పనిచేసుకోవడానికి అభ్యంతరం లేదని చెప్పనున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఎంపీ మందా జగన్నాథం ఇంట్లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల విందు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హాజరయ్యారు. విందులో పాల్గొన్న నేతలందరికీ హైదరాబాద్‌ అభివృద్ధిపై ఎంపీ వివేక్‌ పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. దీనినే బుధవారం ఆజాద్‌కు చూపించనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+