హైదరాబాద్‌కు ఆజాద్, తెలంగాణపై ఉత్కంఠ?

ఇటీవల తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఆజాద్‌ను కలవడానికి అపాయింట్‌మెంట్ కోరగా తానే త్వరలో హైదరాబాద్ వస్తున్నానని చెప్పారట. ఇటు తెలంగాణ నేతలు, అటు సీమాంధ్ర నేతలు సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కరిస్తేనే రాష్ట్రంలో పరిస్థితులు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటాయని ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం కూడా సమస్యను త్వరగా పరిష్కరించాలని చూస్తోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోగానే సమస్యను తేల్చాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆజాద్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీతో మంగళవారం రాత్రి భేటీ అయి త్వరలో పరిష్కారం వస్తుందని ప్రకటన చిదంబరమే చేయొచ్చని చెప్పారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెసులోని ఇరు ప్రాంతాల నేతలను ఢిల్లీ పిలిపించి మాట్లాడటం కంటే హైదరాబాదులోనే వారితో చర్చించాలని ఆజాద్ భావించినట్లుగా కనిపిస్తోంది. ఇరు ప్రాంతాల నేతలతో సమావేశమై వారి వారి అభిప్రాయలను మరోసారి తీసుకోవడం, సమస్య పరిష్కరించే దిశలో ఏ ప్రాంతం వారి నుండైనా వ్యతిరేకత వస్తే వారికి సర్ది చెప్పే ప్రయత్నాలు చేసే అవకాశముంది. ఆ తర్వాతే ఆయన ఢిల్లీకి వెళ్లడం, కేంద్రం నుండి ప్రకటన రావడం జరుగుతుందని పలువురు భావిస్తున్నారు. మొత్తానికి ఇరు ప్రాంతాల నేతలు, ప్రజలకు సానుకూలంగా ఉండే నిర్ణయం తీసుకునే అవకాశముందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రం తప్ప దేనిని ఆమోదించమనడం, సీమాంధ్ర నేతలు రాష్ట్రం యథాతథంగా ఉండాల్సిందేనని పట్టుబడుతున్న నేపథ్యంలో మధ్యేమార్గంగా కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!












Click it and Unblock the Notifications