పార్టీ మారను, కాంగ్రెసులోనే ఉండి పోరాడ్తా: గుత్తా
తిరుపతి: తాను పార్టీ మారబోనని, పార్టీలోనే ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం పోరాడుతానని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. పార్టీ వేరు, ఉద్యమం వేరు కాదని అని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ఓట్లు, ఉద్యమం వేర్వేరు కావని ఆయన అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఓట్ల కోసమే పనిచేస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరే ప్రత్యామ్నాయానికి కూడా తాము అంగీకరించబోమని ఆయన అన్నారు.
రెండో రాష్ట్రాల పునర్వ్యస్థీకరణ కమిషన్ (రెండో ఎస్సార్సీ) తెలంగాణకు వర్తించబోదని, అది ఉత్తరప్రదేశ్‌కు మాత్రమే వర్తిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణపై పార్లమెంటు సమావేశాల లోపు స్పష్టత వస్తుందని భావించడం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో అనిశ్చితికి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలే కారణమని ఆయన అన్నారు. తెలంగాణలో నక్సలిజాన్ని పెంచి పోషించింది ఆంధ్ర నాయకులేనని ఆయన విమర్శించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టకపోతే ప్రధాని మన్మోహన్ సింగ్‌ను నిలదీస్తామని ఆయన చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ అంశంపై తదుపరి కార్యాచరణ రూపొందించుకునేందుకు తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సిద్ధమవుతున్నారు. సోమవారం ఉదయం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు సమావేశం కాబోతున్నారు.












Click it and Unblock the Notifications