విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి, కిరణ్ రెడ్డి, జగన్‌లపై శివాలెత్తిన చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై గురువారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఆయన విజయవాడలోని యువతరంగం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాసిచ్చిన డైలాగులు సినిమాల్లో చెప్పడం సులువేనని, రాజకీయాల్లో రాణించడం కష్టమని చిరంజీవిని ఉద్దేశించి అన్నారు. రెండేళ్లు పార్టీ నడపలేని వారు ప్రజా సేవ చేస్తామనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాల్లో, రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్‌కు ఎవరూ సాటి రారన్నారు. పార్టీ మూసేసిన వారిని ఎన్టీఆర్‌తో పోల్చడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇంగ్లీషులో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పొగిడినందు వల్లే సిఎం పదవి వచ్చిందన్నారు. సిఎంది జాక్ పాట్ పదవి అన్నారు ఆయనకు ఏమీ తెలియకున్నా ఒళ్లంతా పొగరేనని విమర్శించారు. సిఎంకు సబ్జెక్టు లేదని అయినా ఉన్నట్లుగా నటిస్తారని ఆరోపించారు.

ముఖ్యమంత్రి పోలవరం టెండర్ల విషయంలో టిఆర్ఎస్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. పోలవరం టెండర్ల ఫైళ్లు స్పీకర్ ముందు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాల్లో ఒరిజినాలిటీ ఉండాలన్నారు. అది లేకుంటే ఎవరూ రాణించలేరన్నారు. ఇందుకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీయే మంచి నిదర్శనమన్నారు. ఆయన తాను ప్రధానిని కాలేనని తెలిసే తనకు ఆ పదవిపై మక్కువ లేదంటున్నారని అన్నారు. తన కుటుంబానికి గానీ, నందమూరి కుటుంబానికి గాని ఎలాంటి రాజకీయ వారసత్వం లేదని ఆయన అన్నారు. సత్తా లేని వారు రాజకీయాల్లో రాణించలేరన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. అలాంటి అవినీతికి పాల్పడిన వారికి లక్షల విగ్రహాలు పెడతారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆస్తులకు తాను, ఎన్టీఆర్ ట్రస్టీలుగా ఉన్నామని, కాంగ్రెసు మాత్రం దోచుకుంటోందన్నారు.

ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ సోనియా చేతిలో కీలు బొమ్మ అని ధ్వజమెత్తారు. ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లిక్కర్ డాన్ బొత్స సత్యనారాయణకు అన్ని మద్యం దుకాణాలు ఎలా వచ్చాయన్నారు. తనకు దుకాణాలు ఉన్నట్లు ఆయన ఒప్పుకున్నారని అన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆయన ఆహ్వానించారు. కాగా అంతకుముందు బైక్ ర్యాలీతో ఆయన యువతరంగం కార్యక్రమం వేదిక వద్దకు చేరుకున్నారు. చంద్రబాబు స్వయంగా బైక్ నడపడంతో యువత కేరింతలు కొట్టింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత హాజరయింది.

English summary
TDP chief Nara Chandrababu Naidu fired at Chiranjeevi, CM Kiran Kumar Reddy, pcc chief Botsa Satyanarayana and TRS.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X