హైదరాబాద్: యువతకు గాలం వేసేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మరో వ్యూహం రచించింది. శుక్రవారం మధ్యాహ్నం గం.12.10 నిమిషాలకు ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. ఇందులో యువతను ఆకట్టుకునే ఉద్దేశ్యంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఓ స్టేడియం నిర్మించేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.రెండు కోట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా యువత క్రీడలపట్ల మక్కువ చూపిస్తారు. క్రీడారంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా యువతను తమ వైపు లాక్కోవచ్చునని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మాణానికి నిధులు కేటాయించేందుకు సిద్ధపడిందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చీఫ్ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ధీటుగా యువతను తమ వైపు మరల్చుకునేందుకు ఇటీవల ముఖ్యమంత్రి కిరణ్ వారికి పలు పథకాలు ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే. యువతను ఆకట్టుకునేందుకు వారిద్దరూ పలు కార్యక్రమాల ద్వారా ముందుకు వెళుతుంటే కిరణ్ మాత్రం పథకాలతో వెళుతున్నారు.
మొట్టమొదట నిరుద్యోగ యువతను కాంగ్రెసు వైపు మరల్చేందుకు కిరణ్ రాజీవ్ యువకిరణాలు పేరిట ఓ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 2012 జనవరిలోగా లక్ష ఉద్యోగాలు, మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు యువతకు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఇటీవలె మరో పథకానికి ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ భృతి కల్పించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. నెలకు రూ.1000 చొప్పున సంవత్సరానికి రూ.పన్నెండువేలు ఒక్కసారిగా ఇవ్వాలని సిఎం ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయమై సాధ్యాసాధ్యాలపై కూడా సిఎం అధికారులతో చర్చిస్తున్నారట.