హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి శనివారం తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. నాయకత్వ లక్షణాలు లేని వ్యక్తిని కాంగ్రెసు పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రిని చేసిందని ఆరోపించారు. మద్యం సిండికేట్లపై జ్యూడిషియల్ విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం అవినీతిలో తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఎలాంటి ప్రమేయం లేదని 2003లో కోర్టు ఇచ్చిన తీర్పు కాపీని సిఎంకు, స్పీకర్‌కు అందజేస్తామని అన్నారు. చట్టాల మీద, శాసనసభ మీద సిఎంకు విశ్వాసం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. మద్యం కేసులో బాబు ఎప్పుడూ కోర్టుకు వెళ్లలేదని ఆయన పేరుపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలేదని అలాంటప్పుడు స్టే ఎలా తెచ్చుకుంటారని ప్రశ్నించారు. తప్పుడు ప్రచారానికి, ప్రతిపక్షాలపై బురద జల్లడానికి ముఖ్యమంత్రి శాసనసభను ఉపయోగించుకుంటున్నారని దుయ్యబట్టారు.
బాబుపై సిఎంవి నిరాధార ఆరోపణలు అన్నారు. తప్పుడు ఆరోపణలతో సిఎం సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేశారన్నారు. ఆయన తీరు స్పీకర్‌ను బెదిరించేలా ఉందన్నారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని చెప్పారు. తప్పుడు సమాచారంతో ఆయన తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెసు పార్టీ బాబు తప్పు చేసి ఉంటే ఇన్నాళ్లు గాడిదలు కాశారా అని బొజ్జల గోపాల కృష్ణ, గాలి ముద్దు కృష్ణమ నాయుడు విమర్శించారు. మద్యం కుంభకోణం బోఫోర్స్ కంటే పెద్దదన్నారు. తప్పు చేశామని ఒప్పుకుంటేనే కాంగ్రెసు వారు తమను సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.