న్యూఢిల్లీ: సెజ్ ల పేరుతో భూములు తీసుకొని వాటితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెసు పార్టీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు సోమవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాశారు. సెజ్‌ల పేరుతో రాష్ట్రంలో తీవ్రంగా నిబంధనల అతిక్రమణలు జరిగాయని, పేద రైతుల భూముల్ని తీసుకున్న కంపెనీలు వారి కళ్లముందే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ భారీగా లాభార్జన చేస్తున్నాయని లేఖలో పోర్కొన్నారు. దానితో పాటు రాష్ట్రంలో అనుమతి పొందిన 109 సెజ్‌ల వివరాలను కూడా పొందుపరిచారు. అదనపు ఆదాయం తెచ్చే పనుల్ని పెంపొందించటం, వస్తు, సేవల ఎగుమతిని ప్రోత్సహించటం, ఉపాధి అవ కాశాలను మెరుగుపర్చటం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి పర్చటం అనే లక్ష్యాలతో కేంద్రప్రభుత్వం సెజ్‌ల విధానాన్ని తీసుకొచ్చిందని వివరించారు.
అయితే ఆంధ్రప్రదేశ్‌లో సెజ్‌లు పొందిన కంపెనీలు ఇవేమీ పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. 109 సెజ్‌లు అనుమతి పొందగా, వాటిలో 36 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌లో అనుమతి పొందిన సెజ్‌లు 35 మాత్రమేనని గుర్తు చేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి ప్రభుత్వ అండదండలతో కొన్ని ప్రైవేటు కంపెనీలు పెద్ద ఎత్తున భూములు పొందాయని తెలిపారు. ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా ఐటీ పార్క్, రాంకీ ఫార్మాసిటీ, బ్రాండిక్స్, మైటాస్, అన్‌రాక్ తదితర సెజ్‌లన్నీ ఇలాగే భూములు పొందాయని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా సెజ్‌లపై సమీక్ష జరపాలని కోరారు.