ఆధారాల్లేకుండా జగన్‌పై చెయ్యి వేస్తే..: అంబటి హెచ్చరిక

జగన్ ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టే ఆధారాలు లభించలేదన్నారు. కాంగ్రెసు, టిడిపి చెప్పినట్టు విని సిబిఐ జగన్ ను అరెస్టు చేస్తే మాత్రం లక్షలాది ప్రజల చేతులు లేస్తాయని హెచ్చరించారు. కాంగ్రెసు చెప్పినట్టు సిబిఐ వింటే జరిగే పరిణామాలకు ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఆధారాలు లేకుండా జగన్ పై చెయ్యి వేస్తే వొళ్లు దగ్గర పెట్టుకోవాలన్నారు. ఇది జగన్ పై పడుతున్న చెయ్యిగా ఎవరూ భావించరని, తెలుగు గడ్డపై, ప్రజలపై పడుతున్న చెయ్యిగా భావిస్తారన్నారు. జగన్ అరెస్టు ప్రచారం కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తోందని అన్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయినా కేవలం రాజకీయ కక్ష కోసమే ఈ ప్రచారం అన్నారు. ప్రజలే తన బిడ్డగా జగన్ ను ఆదరిస్తున్నారన్నారు. కాంగ్రెసు, టిడిపిలకు ధైర్యం ఉంటే ఎన్నికల్లో సత్తా చూపాలని సవాల్ విసిరారు. ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో ఉప ఎన్నికల్లో తేలుతుందన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిని క్రిమినల్ గా చూపించారని దానికి పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఏం బాధ్యత వహించారని ప్రశ్నించారు. జగన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న కాంగ్రెసును ఆ దేవుడు కూడా రక్షించలేడన్నారు. వైయస్ కుటుంబంపై కక్ష సాధింపును ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు గతంలో కంటే మెజార్టీ అధికంగా వస్తుందన్నారు. జగన్ ఇంటికి అభిమానంతోనే కార్యకర్తలు వచ్చారన్నారు. సోమవారం నుండి జగన్ కొవ్వూరు ప్రచారం యథావిథంగా జరుగుతుందన్నారు. నేతలను కలిసేందుకు జగన్ కొంత సమయం కేటాయించారని అన్నారు. అన్ని పత్రికలు ఎలాంటి ఊహాగానాలకు తావివ్వవద్దన్నారు.