ఏలూరు: ఓ అమ్మాయి వేధింపులు భరించలేక ఓ అబ్బాయి ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన సోమవారం పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో చోటు చేసుకుంది. ఏలూరుకు చెందిన జగదీష్ అనే యువకుడు రోజూ వారి పని చేస్తుంటాడు. అతనిని జయరాణి అనే యువతి నిత్యం.. నేను నిన్ను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకోమని వేధిస్తోంది. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని జగదీష్ ఎంతగా చెప్పినప్పటికీ ఆమె మాత్రం వేధింపులు మానలేదు. దీంతో ఆమె వేధింపులు భరించలేక అతను పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇది గమనించిన తల్లిదండ్రులు, స్థానికులు జగదీష్ ను ఏలూరు ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది.
జగదీష్‌ను కొద్దికాలంగా జయ రాణి ప్రేమ, పెళ్లి అంటూ వేధిస్తోందని, గతంలో పెళ్లి నిరాకరించినందుకు పెద్దల చేత కొట్టించిందని జగదీష్ బంధువులు ఆరోపిస్తున్నారు. జయ రాణి ఓ రాజకీయ నాయుకుడి ఇంట్లో పని చేస్తోందని, తాము సామాన్యులమని, ఆ ధైర్యంతోనే నిత్యం వేధిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. గతంలో పోలీసుల చేత కూడా కొట్టించిందని వారు అంటున్నారు.