హైదరాబాద్: ఐఏఎస్ అధికారులు బిపి ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం విచారణకు అనుమతి వేగంగా లభించేలా కేంద్రాన్ని ఆదేశించాలని సిబిఐ వేసిన పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం శుక్రవారం తిరస్కరించింది. కేంద్రాన్ని ఆదేశించే వెసులుబాటు లేదని కోర్టు సిబిఐ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఛార్జీషీట్ ఆమోదించడం ఎలా సాధ్యమని కోర్టు సిబిఐని గతంలో ప్రశ్నించింది. దీంతో ఇవాళ బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్ ల రిమాండ్ పొడిగింపు సమయంలో సిబిఐ మెమో దాఖలు చేసింది. ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యంల విచారణ కోసం కేంద్రానికి లేఖ రాశామని, ఆ ప్రక్రియ వేగవంతం చేయమని ఆదేశాలివ్వాలని సిబిఐ కోరింది. సిబిఐ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనుమతి ప్రక్రియ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వడానికి చట్టపరమైన వెసులుబాటు లేదని సిబిఐ కోర్టు తెలిపింది.
కాగా ఆచార్య, కోనేరులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించిన న్యాయస్థానం ఈ నెల 16 వరకు రిమాండ్ పొడిగించింది. అంతకుముందు సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణష న్యాయవాది రవీంద్రనాథ్, న్యాయమూర్తి నాగమారుతీ శర్మ ఛాంబరులోకి వెళ్లి చర్చించడంపై ఆచార్య, కోనేరుల న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని, కొన్ని వివరణల కోసం పిలిచానని న్యాయమూర్తి చెప్పారు.