రాయపూర్: చత్తీస్‌గఢ్‌లో సోమవారం ఓ ఐపిఎస్ అధికారు ఆత్మహత్య చేసుకున్నారు. బిలాస్పూర్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ శర్మ తన సర్వీస్ రివాల్వర్‌తో తలపై కాల్చుకొని చనిపోయారు. తన బంగళాకు పనులు జరుగుతుంటడంతో అతను పోలీస్ ఆఫీసర్స్ మెస్‌కు మాకం మార్చారు. ఇతని వయస్సు నలభై. సోమవారం మధ్యాహ్నం స్నానాల గదిలో ఈ ఘటనకు పాల్పడ్డారు. కాల్పుల శబ్దం విన్న వెంటనే ఆయన గన్ మెన్ పరుగెత్తుకు వచ్చి చూడగా, రక్తం మడుగులో పడి ఉన్నారు. వెంటనే చత్తీస్‌గఢ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించారు. అయితే ఫలితం లేకుండా పోయింది. కొద్దికాలం క్రితమే రాయగఢ్ బరేలి నుండి బిలాస్పూర్‌కు బదలీపై రాహుల్ శర్మ వచ్చారు. జిల్లాలో బొగ్గు మాఫియా అక్రమాలను ఎదురిస్తున్నారు. ఫలితంగా కోర్బా, బిలాస్పూర్ పరిధుల్లోని అక్రమ బొగ్గు వ్యవహారాలకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు బొగ్గు మైనింగ్ మాఫియాల ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా రాహుల్ శర్మ గతంలో దంతెవాడ ఎస్పీగా పని చేసినప్పుడు ఎస్పీవోల నియామకం చేపట్టారు. సల్వాజుడుం ఏర్పాటులో అతనిది కీలక పాత్ర అని అంటారు. ఇతను 2002 బ్యాచ్ ఐపిఎస్ అధికారి. 2008-2009 మధ్య దంతెవాడ ఎస్పీగా పని చేశారు. మావోయిస్టుల అణిచివేతలో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించారు. మెరికల్లాంటి యువకులను సమీకరించి పోలీసు శాఖలో ఎస్పీవోలుగా నియమించారట. కాగా ఆయన సతీమణి గాయత్రీ శర్మ బిలాస్పూర్‌లోనే రైల్వే అధికారిగా పని చేస్తున్నారు. రాహుల్ శర్మ మృతికి చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. మృతిపై విచారణకు ఆదేశించారు.